Pawan’s Decision: గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖల్లో సంస్కరణలు - పవన్ నిర్ణయం

తాగునీటి శాఖల్లో సంస్కరణలు - పవన్ నిర్ణయం

Update: 2025-12-13 15:15 GMT

Pawan’s Decision: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల్లో విస్తృత సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖలో జరిగిన మార్పుల తరహాలో ఈ రెండు శాఖల్లోనూ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పరిపాలనా విధానాల్లో మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం (డిసెంబర్ 13, 2025) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల అధికారులు, ఇంజినీర్లతో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఉద్యోగుల నియామక విధానం, వివిధ స్థాయుల్లో హోదాలు వంటి అంశాలపై వివరంగా చర్చించారు.

గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టే అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కావాలని ఆయన ఆదేశించారు. ప్రజల్లో అభివృద్ధి పట్ల సంతృప్తి పెంచేలా కొత్త ఆలోచనలు అమలు చేయాలని సూచించారు. 'స్వచ్ఛ రథం', 'మ్యాజిక్ డ్రైన్' వంటి నూతన కార్యక్రమాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఉద్యోగులకు ప్రోత్సాహం కల్పించే వాతావరణం సృష్టించాలి. మెరుగైన రోడ్లు, స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి.

జలజీవన్ మిషన్ పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండేందుకు శాఖలో సాంకేతిక మార్పులు చేయాలని పవన్ సూచించారు. ఇప్పటికే అమలులో ఉన్న నీటి సరఫరా పథకాలు సమర్థవంతంగా సాగాలి. నీటి నాణ్యత పరీక్షలు క్రమం తప్పకుండా జరగాలి.

ఉపాధి హామీ పథకం ద్వారా కార్మికులతోపాటు ప్రజల్లో సానుకూలత పెంచే బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని ఆయన గుర్తు చేశారు. గ్రామసభల్లో తీర్మానించిన పనులపై సకాలంలో సమీక్షలు చేపట్టాలి. చేపట్టే సంస్కరణలు అంతిమంగా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి.

గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలు, ఉత్తమ పద్ధతులపై వివరణాత్మక నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, మంత్రి ఓఎస్డీ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News