Senior Congress leader Mani Shankar Aiyar: కాంగ్రెస్‌ బలమే అసమ్మతి.. దాన్ని అణచివేస్తే వినాశనమే!

దాన్ని అణచివేస్తే వినాశనమే!

Update: 2026-02-18 05:02 GMT

Senior Congress leader Mani Shankar Aiyar: అసమ్మతిని సహించని పరిస్థితి కాంగ్రెస్‌లో ఏర్పడితే అది పార్టీ వినాశనానికి దారితీస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ హెచ్చరించారు. కాంగ్రెస్ మనుగడకు మూలం అసమ్మతే అని, విభిన్న అభిప్రాయాల సమ్మేళనమే పార్టీని బలోపేతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

తన యూట్యూబ్ ఛానల్ కోసం రూపొందించిన 23 నిమిషాల వీడియోలో మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ, ‘‘దేవుడు ఒక్కడే.. ఆయనను చేరే మార్గాలెన్నో’’ అనే వేద వాక్కును ఉదహరిస్తూ కాంగ్రెస్‌ను వర్ణించారు. ‘‘కాంగ్రెస్ ఒక్కటే కానీ, దాన్ని చేరే మార్గాలు అనేకం. అసమ్మతే పార్టీ బలం, ప్రజాస్వామ్యానికి పునాది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత నాయకత్వం ఈ విషయాన్ని మరచిపోయినట్లు ఉందని విమర్శించారు.

అసమ్మతిని అణచివేసిన చారిత్రక ఉదాహరణగా ఇందిరా గాంధీ కాలాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘అసమ్మతి ఉందనే కారణంతో ఇందిరా గాంధీ పార్టీని చీల్చి, ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రధానిగా కొనసాగడానికి అదొక్కటే మార్గమని భావించారు. దాని ఫలితంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇందిరా స్వయంగా రాయ్‌బరేలీలో ఓడిపోగా, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ అమేఠీలో ఓటమి చవి చూశారు’’ అని ఆయన వివరించారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1989లో పార్లమెంటులో చెప్పిన మాటలను గుర్తుచేస్తూ, ‘‘లౌకిక దేశంగా ఉంటేనే భారత్ మనుగడ సాగిస్తుందని రాజీవ్ అన్నారు. ఆ మాటలను రాహుల్ గాంధీ మళ్లీ చెప్పగలరా?’’ అని మణిశంకర్ అయ్యర్ సవాలు విసిరారు.

పార్టీ నాయకత్వంతో తన సంబంధాలు దిగజారుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల కేరళ శాసనసభ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని పినరయి విజయన్ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ప్రకటించడంతోనూ ఆయన సంచలనం రేపారు.

Tags:    

Similar News