భర్తను చూసి షాక్ - మూడో అంతస్తు నుంచి దూకిన మహిళ
Shocked to see her husband - woman jumps from third floor;
వైవాహిక జీవితంలో విభేదాలు ఓ హద్దు దాటితే, వ్యక్తిగత సంబంధాలు ఏవిధంగా మరింత సంక్లిష్టం అవుతాయో నిదర్శనంగా నిలిచే ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లా బడౌత్ పట్టణంలో చోటుచేసుకుంది. ప్రియుడితో హోటల్ గదిలో ఉన్న ఓ వివాహిత, అకస్మాత్తుగా తన భర్త అక్కడకు చేరుకోవడంతో ఊహించని ఆ పరిణామానికి వణికిపోయింది. ఏం చేయాలో పాలుపోక హోటల్ మూడో అంతస్థు నుంచి కిందికి దూకి పరారయ్యే ప్రయత్నం చేసింది.
ఈ సంఘటన సోమవారం జరగ్గా... హోటల్ గది నుంచి మహిళ దూకుతూ పారిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహిళకు ఏమైనా గాయాలయ్యాయా? అనే అంశంపై క్లారిటీ లేకపోయినప్పటికీ ఆమె మాత్రం అక్కడినుంచి క్షణాల్లో పారిపోయింది.
వివరాల్లోకి వెళ్తే, 2019లో వివాహమైన ఈ మహిళకు ఓ కుమారుడు ఉన్నాడు. కానీ భర్తతో తరచూ గొడవలు జరుగుతుండటంతో, ప్రస్తుతం బాగ్పత్ ఎస్పీ కార్యాలయం మహిళా విభాగంలో కౌన్సెలింగ్ కొనసాగుతోంది. అయితే, విభేదాల నేపథ్యంలోనే ఆమె శోభిత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ బడౌత్ పట్టణంలోని ఓ హోటల్ గదిలో గడుపుతుండగా, అనూహ్యంగా భర్త అక్కడికి వచ్చాడు.
భర్త తన భార్యను శోభిత్తో హోటల్ గదిలో చూడగానే ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు అప్రమత్తమై హోటల్ గదిలో ఉన్న శోభిత్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా, భర్త తన ప్రాణాలకు ముప్పు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది.
ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన బడౌత్ ఎస్‌హెచ్‌వో మనోజ్‌కుమార్ చాహల్, శోభిత్‌ను అదుపులోకి తీసుకున్నామని, ప్రస్తుతం విచారణ జరుగుతోందని, సంబంధిత వీడియోలు, ఫిర్యాదుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.