Siddaramaiah to Resign: రేపే సిద్ధరామయ్య రాజీనామా? దిల్లీ హైకమాండ్‌తో కీలక చర్చలు.. రాజ్యసభతో పాటు విపక్ష నేత పదవి అవకాశాలు!

రాజ్యసభతో పాటు విపక్ష నేత పదవి అవకాశాలు!

Update: 2026-05-27 05:23 GMT

తదుపరి సీఎం రేసులో డీకే శివకుమార్, పరమేశ్వర్

Siddaramaiah to Resign: కర్ణాటకలో నాయకత్వ మార్పు తథ్యమైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రేపు (గురువారం) రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం సహచర మంత్రులతో అల్పాహారం విందు ఇచ్చి, ఆ తర్వాత లోక్‌భవన్‌లో గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పించనున్నారు.

మంగళవారం దిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ అధిష్ఠానం సుదీర్ఘ చర్చలు జరిపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు పాల్గొన్నారు.

అధిష్ఠానం సిద్ధరామయ్యను సీఎం పదవి వదులుకొని నాయకత్వ మార్పుకు సహకరించాలని సూచించింది. బదులుగా రాజ్యసభ స్థానం ఇచ్చి, ఆ సభలో విపక్ష నేతగా కూడా అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కూడా చర్చల్లో భాగమైంది.

డీకేకు చెక్ పెట్టేలా సిద్ధరామయ్య మెలిక

రాజీనామా చేసినా సీఎం పదవి అహింద (అల్పసంఖ్యాక, హిందూ, దళిత) వర్గాలకు కేటాయించాలని సిద్ధరామయ్య అధిష్ఠానానికి సూచించారు. తనకు వంద మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, శాసనసభాపక్ష సమావేశంలో ఓటింగ్ ద్వారా సీఎం అయినట్లు గుర్తు చేశారు. అహింద నేతకు అవకాశం ఇస్తే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

దీని వల్ల దళిత నేత, హోంమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్‌కు సీఎం అవకాశం దక్కవచ్చు. మరోవైపు డీకే శివకుమార్ 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత సీఎం పదవి తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఖర్గే రాజ్యసభ సభ్యత్వం ముగిస్తున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని సిద్ధరామయ్యతో భర్తీ చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కర్ణాటక సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News