Sonia Gandhi: డీలిమిటేషన్ చట్ట సవరణ అత్యంత ప్రమాదకరం, రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ తీవ్ర విమర్శ
రాజ్యాంగంపై దాడి: సోనియా గాంధీ తీవ్ర విమర్శ
Sonia Gandhi: కేంద్రంలోని ఎన్‌డీయే ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ అత్యంత ప్రమాదకరమని, రాజ్యాంగంపై జరుగుతున్న దాడి అని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ద్వారా ఈ వారంలో కేంద్రం తీసుకురాబోయే బిల్లు డీలిమిటేషన్‌కు సంబంధించినదేనని, మహిళా రిజర్వేషన్లతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
లోక్‌సభలో చేపట్టే ఏ డీలిమిటేషన్ అయినా సంఖ్యాపరంగా కాకుండా రాజకీయ సమానత్వం సాధించేదిగా ఉండాలని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. కుల గణనను ఆలస్యం చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో ఆరోపించారు.
“పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ద్వారా బుల్‌డోజర్‌తో చట్ట అనుబంధ సవరణలు చేయాలని ప్రధాని ప్రతిపక్షాలను మద్దతు కోరుతున్నారు. అదీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో జరగడం గమనార్హం. ఇంత అత్యవసరంగా దీనిని చేపట్టడానికి ఒక్క కారణమే ఉంది. అది రాజకీయ లబ్ధి పొందడం.. ప్రతిపక్షాలను ఆత్మరక్షణలో పడేయడం. ఎప్పటిలాగే ప్రధాని నిజాన్ని దాచేస్తున్నారు” అని సోనియా గాంధీ విమర్శించారు.
2023 సెప్టెంబరులో జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో నారీ శక్తి అధినియం బిల్లు ఆమోదం పొందిందని, రాజ్యాంగంలో ఆర్టికల్ 334-ఏను చేర్చిందని ఆమె గుర్తు చేశారు. దీని ప్రకారం జనగణన, దాని ఆధారంగా డీలిమిటేషన్ పూర్తయ్యాక మహిళలకు చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని వివరించారు.
సోనియా గాంధీ వ్యాసంలో డీలిమిటేషన్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ఇంత తొందరపాటు వెనుక రాజకీయ లబ్ధి ఉద్దేశమే ఉందని ప్రధాని మోదీపై ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు ఏకమై ప్రభుత్వాన్ని సవాలు చేయాలని పిలుపునిచ్చారు.