సుస్థిర మైనింగ్ విధానాలపై ప్రత్యేక దృష్టి
అంతర్జాతీయ మైనింగ్ సదస్సులో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి.;
వికసిత్ భారత్ లో భాగంగా దేశంలోని వివిధ ఖనిజ పరిశ్రమలు తమ ఉత్పత్తులు పెంచాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో ప్రకృతి పట్ల, ప్రజల పట్ల బాధ్యతాయుతంగా మైనింగ్ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్లో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి మైనింగ్ సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. పర్యావరణహిత, బాధ్యతాయుత మైనింగ్ అనే అంశంపై ఈ సదస్సును కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ అవసరాలకు అనుగుణంగా తగినంత బొగ్గు, అల్యూమినియం, రాగి తదితర ఖనిజాలను ఉత్పత్తి చేసి, ఈ రంగాలలో దేశాన్ని స్వయంసమృద్ధి దిశగా నడిపించాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉందని, అదే సమయంలో ప్రకృతికి నష్టం జరగకుండా, ప్రజలకు ఉపయోగపడే విధంగా బాధ్యతాయుత మైనింగ్ ను నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ దిశగా పటిష్టమైన నిబంధనలను రూపొందించుకొని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
బొగ్గు గనులు ప్రారంభించడంతోపాటు అవి నడుస్తున్నప్పుడు, మూత పడినప్పుడు కూడా ఆ ప్రాంత ప్రకృతికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా, యధాతథస్థితిని నెలకొల్పే విధంగా పరిశ్రమలు చర్యలు తీసుకోవాలన్నారు. తమిళనాడు రాష్ట్రంలో కొన్ని గనులు ఈ విషయంలో దేశానికి ఆదర్శప్రాయంగా ఉన్నాయని పేర్కొన్నారు. మూసివేసిన గనుల ద్వారా స్థానిక ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించారని, ఈ తరహా పద్ధతులను ఇతర పరిశ్రమల వారు కూడా ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గు గనుల్లో అనుసరిస్తున్న గనుల మూసివేత విధానాలను ఇతర ఖనిజ పరిశ్రమలలో కూడా అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యావరణహిత మైనింగ్ తో పాటు ప్రజల భాగస్వామ్యంతో వారి అభివృద్ధికి తోడ్పడే విధానాలను మైనింగ్ పరిశ్రమ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన మైనింగ్ సంస్థల వారు, మైనింగ్ మేధావులు ఈ సదస్సులో తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు బొగ్గు శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే , బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రూపేంద్ర బ్రార్, కోలిండియా చైర్మన్ పీఎం ప్రసాద్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, వివిధ PSUల CMDలు, బొగ్గు, అల్యూమినియం, రాగి పరిశ్రమల అధికారులు మరియు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సదస్సులో ముందుగా పర్యావరణహిత, ప్రజాహిత మైనింగ్ ప్రక్రియ విషయాలను వివరిస్తూ రూపొందించిన మిషన్ గ్రీన్ బుక్, రిక్లెయిమ్ అనే పుస్తకాలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. అలాగే అన్వేషణ విభాగం కోసం సింగిల్ విండో విధానం అమలు జరుపుతూ రూపొందించిన పోర్టల్ ను కూడా ఆవిష్కరించారు. అలాగే ఆన్ లైన్ ద్వారా 24వ నైవేలి బుక్ ఫెయిర్ 2025ను కూడా ప్రారంభించారు.
హైదరాబాద్‌లో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ సదస్సు సందర్బంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడిన ముఖ్యంశాలు
ఈ సదస్సుకు దేశంలోని పబ్లిక్ సెక్టార్‌లో పనిచేస్తున్న మైనింగ్ కంపెనీలు, అంతర్జాతీయ మైనింగ్ సంస్థల నుంచి సుమారు 8 దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మైనింగ్ రంగంలో, కోల్, లైమ్‌స్టోన్, ఐరన్ ఓర్ వంటి ఖనిజాల అన్వేషణ పూర్తయ్యిన తర్వాత శాస్త్రీయ పద్ధతిలో మైన్ క్లోజర్ యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. మైన్ క్లోజర్ యాక్టివిటీలను విస్మరించడం వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, భూములు ఉపయోగపడట్లేదు, ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మైనింగ్ పూర్తయ్యిన తర్వాత ఆ భూమిని చదును చేసి, స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మైనింగ్ పూర్తయిన భూముల్లో ఫిషరీస్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
మైనింగ్ పూర్తయిన తర్వాత భూములను ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా ఆదేశించారు. ప్రభుత్వ పరంగా ఇప్పటివరకు 143 మైనింగ్ ప్రాజెక్టులు మైనింగ్ పూర్తయిన అనంతరం డీకోల్ అయ్యాయి. ఈ మైన్స్ అన్నింటినీ మైన్ క్లోజర్ యాక్టివిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ యాక్టివిటీలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఇప్పటికే రూపొందించబడింది.
వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ కోల్ బ్లాక్స్ అన్నిటికీ మైన్ క్లోజర్ యాక్టివిటీస్ చేపట్టి, పర్యావరణాన్ని రక్షించేందుకు, ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రకృతికి అనుకూలమైన అభివృద్ధి కోసం మైన్ క్లోజర్ యాక్టివిటీలను కొనసాగించేలా కార్యాచరణ రూపొందించబడుతోంది. ఈ సమావేశంలో మైన్ క్లోజర్ యాక్టివిటీలకు సంబంధించి విస్తృతంగా చర్చ జరుగుతోంది.