Massive Explosion Near Red Fort: ఎర్రకోట దగ్గర భారీ పేలుడు.. 8 మంది మృతి, 7 మందికి గాయాలు

8 మంది మృతి, 7 మందికి గాయాలు

Update: 2025-11-10 15:34 GMT

మెట్రో స్టేషన్ గేట్-1 పార్కింగ్‌లో కారు పేలుడు.. 5 వాహనాలు ఛిద్రం!

ఉగ్రవాద కుట్ర కాదని తోసిపుచ్చలేని పోలీసులు.. దేశవ్యాప్త హై అలర్ట్!

సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ.. దర్యాప్తు ముమ్మరం

Massive Explosion Near Red Fort: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భయానక పేలుడు సంభవించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. చారిత్రక ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పార్కింగ్ చేసిన ఓ కారులో ఈ భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఆ కారు పూర్తిగా ఛిద్రమైంది. సమీపంలో ఉన్న మరో నాలుగు కార్లు కూడా మంటల్లో చిక్కుకుని ధ్వంసమయ్యాయి. పరిసర ప్రాంతంలోని పలు దుకాణాలు కూడా ఈ ప్రభావంతో నేలమట్టమయ్యాయి.

సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని 7 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్, ఫోరెన్సిక్ బృందాలు, బాంబ్ స్క్వాడ్ సభ్యులు స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడు జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

8 మంది దుర్మరణం.. ముగ్గురి పరిస్థితి విషమం

పేలుడులో తొలుత 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తక్షణమే సమీపంలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రికి తరలించారు. అయితే ఆంబులెన్స్‌లోనే 8 మంది ప్రాణాలు విడిచారు. మిగతా 7 మందిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లోక్ నాయక్ జయ్ ప్రకాష్ నారాయణ్ తెలిపారు. నలుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

ఉగ్రవాద కుట్ర అనుమానం.. దేశవ్యాప్త హై అలర్ట్

ఢిల్లీ పోలీసులు ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా తోసిపుచ్చలేకపోతున్నారు. “పేలుడు ఎలా జరిగింది? ఏ పదార్థం వల్ల వచ్చింది? ఇది యాదృచ్ఛికమా లేక కుట్రా? అన్నది దర్యాప్తు తర్వాతే తెలుస్తుంది” అని సీనియర్ అధికారులు వెల్లడించారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ ఘటనప ఘటనపై తక్షణమే స్పందించి ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వంటి మెగా సిటీల్లో హై అలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాల డీజీపీలకు సర్క్యులర్ జారీ చేసింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్ల వద్ద సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు.

ప్రధాని కార్యాలయం నుంచి కూడా ఈ ఘటనపై నిరంతర అప్‌డేట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎర్రకోట ప్రాంతం ఎప్పుడూ టూరిస్టులతో కిటకిటలాడే ప్రాంతం కావడంతో.. ఈ పేలుడు దేశవ్యాప్తంగా కలవరం రేకెత్తించింది.

Tags:    

Similar News