Arvind Kejriwal: విదేశీ విమానాల్లో ప్రయాణం మానండి: మోడీ స్వదేశీ పిలుపుపై కేజ్రీవాల్ విమర్శ
మోడీ స్వదేశీ పిలుపుపై కేజ్రీవాల్ విమర్శ
Arvind Kejriwal: స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన పిలుపుపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను స్వదేశీ ఉత్పత్తులను కొనమని చెప్పే మోడీ, తాను మాత్రం విదేశీ విమానాల్లో ప్రయాణించడం, విదేశీ వస్తువులను ఉపయోగించడం ఏమిటని ప్రశ్నించారు. మాటల్లో కాదు, చేతల్లో స్వదేశీని ఆచరించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై కేజ్రీవాల్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
‘‘మీరు స్వదేశీని ఎందుకు మొదలు పెట్టకూడదు? రోజూ విదేశీ విమానాల్లో ప్రయాణిస్తున్నారు, వాటిని ఎందుకు వదులుకోరు? మీరు ఉపయోగించే విదేశీ వస్తువులను ఎందుకు త్యజించరు? భారత్‌లో పనిచేస్తున్న నాలుగు అమెరికన్ కంపెనీలను ఎందుకు మూసివేయరు?’’ అని కేజ్రీవాల్ మోడీని నిలదీశారు. ప్రజలు తమ ప్రధానమంత్రి నుంచి చర్యలు ఆశిస్తున్నారని, కేవలం ప్రసంగాలు కాదని ఆయన అన్నారు.
2025 సెప్టెంబర్ 21న జీఎస్టీ 2.0 సంస్కరణల అమలు సందర్భంగా ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన స్వావలంబనను ప్రోత్సహించాలని, విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించాలని పౌరులకు పిలుపునిచ్చారు. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటం దేశానికి ప్రమాదకరమని, భారత యువత కష్టపడి తయారు చేసిన స్వదేశీ ఉత్పత్తులను కొనమని సూచించారు. ఈ నేపథ్యంలో మోడీ స్వదేశీ వాదనపై కేజ్రీవాల్ ఈ కౌంటర్ ఇచ్చారు.