Rahul Gandhi: ఎన్‌టీఏ తప్పులకు విద్యార్థులే బలి.. రాహుల్ గాంధీ ఘాటు విమర్శ
రాహుల్ గాంధీ ఘాటు విమర్శ
Rahul Gandhi: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తీరుపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజీసీ-నెట్ పరీక్షలో సోషియాలజీ, ఇంగ్లిష్, కామర్స్ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేసి సెప్టెంబర్‌లో మళ్లీ నిర్వహించాలని ఎన్‌టీఏ తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ రాసిన పోస్టులో “మోదీజీ.. మీ ఎన్‌టీఏ ఏం చేసిందో చూడండి” అని ప్రస్తావిస్తూ, జూన్ 22 నుంచి 30 వరకు జరిగిన ఈ మూడు పరీక్షలను దాదాపు రెండు నెలల తర్వాత ప్రశ్నపత్రాల్లో లోపాలు, పాత ప్రశ్నల పునరావృతం కారణంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. దీనివల్ల ఏళ్ల తరబడి సిద్ధమైన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి, ఫీజులు చెల్లించాల్సి, దూర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రయాణించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “తప్పు చేసింది ఎన్‌టీఏ.. కానీ శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులా?” అని ప్రశ్నించారు.
పరీక్షా వ్యవస్థ విద్యార్థులను దోపిడీ చేసే యంత్రంగా మారిందని రాహుల్ ఆరోపించారు. దేశంలో సరైన పరీక్షా వ్యవస్థ లేదని, ఇది విద్యా వ్యవస్థ కాదని, డబ్బు, సమయం, మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని తీసుకుని చివరికి ఉద్యోగం కూడా ఇవ్వని వ్యవస్థగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కోటా, డెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్‌లలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు గుర్తు చేశారు.
ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే లీకయ్యాయా అనే సందేహం వ్యక్తం చేస్తూ, దీనికి ఎన్‌టీఏ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదటి అడుగు మాత్రమేనని చెప్పి, ఎన్‌టీఏ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“సెప్టెంబర్‌లో మళ్లీ పరీక్ష రాయనున్న ప్రతి విద్యార్థికి చెబుతున్నా.. మీరు సమస్య కాదు. పరీక్షను నిర్వహించలేని వ్యవస్థను ప్రధాని మోదీ ప్రభుత్వం నిర్మించింది. ఆ వ్యవస్థ చేసిన తప్పులకు ఇప్పుడు విద్యార్థులనే బాధ్యులుగా చేస్తోంది. మీ విలువైన సంవత్సరాలు వృథా అవుతున్నాయి. దీనిపై మోదీ సమాధానం చెప్పే వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం” అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.