Supreme Court of India: వివాహమాడింది సేవకురాలిని కాదు.. కుటుంబ బాధ్యతలు ఇద్దరూ పంచుకోవాలి – సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కుటుంబ బాధ్యతలు ఇద్దరూ పంచుకోవాలి – సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Update: 2026-03-21 07:54 GMT

Supreme Court of India: వివాహం అంటే సేవకురాలిని పెళ్లి చేసుకోవడం కాదు, జీవిత భాగస్వామిని పొందడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రోజులు మారాయని, దుస్తులు కడగడం, ఇంటి పనులు, వంట వంటి గృహ కార్యాలను భర్త-భార్యలిద్దరూ సమానంగా పంచుకోవాలని గుర్తు చేసింది. భార్య ఇంటి పనులు సరిగా చేయడం లేదని ఆరోపించడం సరికాదని, అలాంటి పనులు చేయకపోవడాన్ని వేధింపులుగా (క్రూల్టీగా) పరిగణించలేమని స్పష్టం చేసింది.

విడాకుల కేసులో భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘మీరు సేవకురాలిని పెళ్లి చేసుకోలేదు, జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకున్నారు’ అని ధర్మాసనం భర్తకు గుర్తు చేసింది. ఇంటి పనుల్లో భర్త కూడా సహాయపడాలని, వంట, శుభ్రత వంటి బాధ్యతలను సమానంగా పంచుకోవాలని సూచించింది.

ఈ కేసులో దంపతులిద్దరూ ఉద్యోగులు. 2017లో వివాహం జరిగింది. బిడ్డ పుట్టిన తర్వాత భార్య పుట్టింటికి వెళ్లి అక్కడే ఉండిపోయింది. 2019 నుంచి వీరిద్దరూ వేరుగా ఉంటున్నారు. భార్య ఇంటి, వంట పనులు సరిగా చేయకుండా తనను వేధిస్తుందని ఆరోపిస్తూ భర్త కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్‌ దాఖలు చేశాడు. అక్కడ విడాకులు మంజూరయ్యాయి. దీనిని భార్య హైకోర్టులో సవాల్‌ చేయడంతో విడాకులు రద్దయ్యాయి.

భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే అది విఫలమవ్వడంతో, భర్త-భార్యలిద్దరినీ ఏప్రిల్‌ 27న స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. సామాజిక నిబంధనలు మారాయని, ఆధునిక వివాహాల్లో ఇద్దరూ సమాన బాధ్యతలు తీసుకోవాలని కోర్టు ఒత్తిడి చేసింది. ఈ తీర్పు కుటుంబ వ్యవస్థలో సమానత్వానికి, భాగస్వామ్య బాధ్యతలకు మరింత బలం చేకూరుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News