CJI Justice Surya Kant: సుప్రీం కోర్టు: బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు: సీజేఐ

వ్యవస్థపై దాడి చేస్తున్నారు: సీజేఐ

Update: 2026-05-15 13:18 GMT

CJI Justice Surya Kant: ఉద్యోగాలు లేని కొందరు యువకులు బొద్దింకల్లా (cockroaches) మారి న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా, ఆర్‌టీఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

సీనియర్ అడ్వకేట్ హోదా కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించిన న్యాయవాది సంజయ్ దుబే పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాదుల హోదా సంబంధిత సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అమలు చేయడంలో జాప్యం చేస్తోందని, ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

సీనియర్ అడ్వకేట్ హోదా కోర్టు ప్రసాదించే విశిష్ట గౌరవమని, దానిని వ్యాజ్యాల ద్వారా సాధించుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ ప్రవర్తనను తీవ్రంగా మందలిస్తూ సీజేఐ, “ఈ సీనియర్ హోదాను ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వవచ్చు... కానీ మీకు తప్పు. మీ ప్రవర్తన చూసి మేము దాన్ని పక్కన పెడతాం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిటిషనర్ సామాజిక మాధ్యమాల్లో వాడిన భాషను ప్రస్తావిస్తూ సీజేఐ మరింత తీవ్రంగా ప్రశ్నించారు. న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులు తమ దృష్టిలో ఉన్నాయని, వాటిని గమనించడం లేదనుకుంటున్నారా? అని అడిగారు.

అంతేకాకుండా, ఢిల్లీలోని కొందరు న్యాయవాదుల లా డిగ్రీల ప్రామాణికతపై అనుమానాలు ఉన్నాయని, ఈ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశించడానికి తగిన కేసు కోసం ఎదురుచూస్తున్నామని సీజేఐ తెలిపారు. బార్ కౌన్సిల్ తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

విచారణ సమయంలో పిటిషనర్ కోర్టుకు క్షమాపణలు చెప్పి, తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని అనుమతి కోరగా సుప్రీం కోర్టు అనుమతించింది.

సీజేఐ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు న్యాయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల దాడులు, ఉపాధి లేని యువతి-యువకుల పాత్రపై ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్త దృష్టి ఆకర్షించాయి.

Tags:    

Similar News