Supreme Court’s Sensational Remarks on Reservations: రిజర్వేషన్ల ద్వారా సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదిగిన కుటుంబాలు తరతరాలు అదే కోటాను కొనసాగించడంపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై ప్రభుత్వ సర్వీసుల్లో స్థిరపడిన వారి పిల్లలకు రిజర్వేషన్ కోటా ఎందుకు అని ప్రశ్నించింది.

ఈ మేరకు వెనుకబడిన వర్గాల్లోని 'క్రీమీ లేయర్' (ధనిక వర్గం) పరిమితులు, రిజర్వేషన్ మినహాయింపులపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది.

సామాజిక చలనం ఉండాలి

విచారణ సమయంలో జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ, "రిజర్వేషన్ల ద్వారా ఒకసారి విద్య, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన తర్వాత వారి పిల్లలు మళ్లీ కోటా కోరడం సరికాదు. ఇలా కొనసాగితే రిజర్వేషన్ వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేం" అని అన్నారు.

ఒక వ్యక్తి సామాజికంగా వెనుకబడి ఉండవచ్చని, కానీ రిజర్వేషన్ ప్రయోజనం పొంది తల్లిదండ్రులు ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత వారి పిల్లల పరిస్థితి మారుతుందని, ఇక్కడ సమతుల్యత అవసరమని కోర్టు స్పష్టం చేసింది.

చివరి వ్యక్తికి రిజర్వేషన్ ఫలాలు చేరాలి

ఒకే కుటుంబం నుంచి ఉన్నత వర్గాలు అన్ని అవకాశాలు చేజిక్కించుకుంటే, అదే వర్గంలోని అత్యంత వెనుకబడిన, పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వేషన్ ఫలాలు కేవలం కొందరికి మాత్రమే కాకుండా సమాజంలో అడుగున ఉన్న చివరి వ్యక్తికి కూడా అందాలని కోర్టు అభిప్రాయపడింది.

1992 ఇంద్ర సాహ్ని తీర్పు ఆధారంగా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పటి నుంచి క్రీమీ లేయర్ మినహాయింపు వర్తింపజేస్తున్నారు. ప్రస్తుతం రూ.8 లక్షలు దాటిన ఆదాయం, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత అధికారుల పిల్లలను క్రీమీ లేయర్ కింద మినహాయించడం జరుగుతోంది. ఈ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో రాబోయే తీర్పు రిజర్వేషన్ విధానాల్లో మరిన్ని సంస్కరణలకు దారి తీయవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

Tags: