New Chief Minister of Kerala: కేరళ ముఖ్యమంత్రి పదవి పై ఉత్కంఠ అంతమైంది. కాంగ్రెస్ అధిష్ఠానం కేరళ తదుపరి సీఎంగా వీడీ సతీశన్‌ను ఎంపిక చేసింది. కె.సి.వేణుగోపాల్, రమేశ్ చెన్నితాలతో తీవ్ర పోటీ ఎదురైనా చివరకు సతీశన్‌కే ముఖ్యమంత్రి పదవి దక్కింది.

గత నెలలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భారీ విజయం సాధించింది. 140 స్థానాల్లో 102 సీట్లు సాధించి అధికారం చేపట్టే స్థితికి చేరుకుంది. అయితే సీఎం పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడటంతో అధిష్ఠానం పది రోజుల పాటు సమయం తీసుకుంది.

న్యాయవాది నుంచి ప్రజానేతగా...

1964లో కొచ్చి సమీపంలోని నెట్టూర్‌లో జన్మించిన వీడీ సతీశన్ వృత్తిరీత్యా న్యాయవాది. సామాజిక కార్యకర్తగా కూడా పేరు తెచ్చుకున్న ఆయన రాజకీయ ప్రయాణం కేరళ విద్యార్థి సంఘం (KSU) నుంచి మొదలైంది. తర్వాత యూత్ కాంగ్రెస్‌లో చేరి పార్టీని బలోపేతం చేశారు. మంచి వక్తగా గుర్తింపు పొందిన ఆయన ఎలాంటి గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా సంస్కరణావాదిగా ఎదిగారు.

2001లో పరావూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు విజయం సాధించిన సతీశన్, 2021లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. పాలనాపరమైన అనుభవం లేనప్పటికీ, ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తూ, అవినీతి, గోల్డ్ స్మగ్లింగ్, భద్రతా సమస్యలు, పరిపాలన వైఫల్యాలను ఎత్తి చూపి పినరయి విజయన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన భారీగా పాల్గొని యూడీఎఫ్ విజయానికి కీలకపాత్ర పోషించారు.

ఏఐసీసీ పరిశీలకులు జరిపిన అభిప్రాయ సేకరణలో ప్రజల్లో సతీశన్ పేరు ఎక్కువగా వినిపించడంతో అధిష్ఠానం ఆయన్నే సీఎంగా ఎంపిక చేసింది. ఇది కేరళ కాంగ్రెస్‌లో తరం మార్పును సూచిస్తోంది.

సతీశన్ కేరళ 13వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags: