Tamil Nadu Governor R.N. Ravi Walks Out of Assembly: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి అసెంబ్లీ నుంచి వాకౌట్: జాతీయగీతానికి అవమానం కారణమని రాజ్‌భవన్ ఆరోపణ

జాతీయగీతానికి అవమానం కారణమని రాజ్‌భవన్ ఆరోపణ

Update: 2026-01-20 06:17 GMT

Tamil Nadu Governor R.N. Ravi Walks Out of Assembly: తమిళనాడు శాసనసభలో ఈ ఏడాది తొలి సమావేశం మంగళవారం ప్రారంభమైంది. అయితే, గవర్నర్ ఆర్.ఎన్.రవి తన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండానే సభ నుంచి నిష్క్రమించారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో తాజా వివాదాస్పద సంఘటనగా మారింది.

సభ ప్రారంభంలో తమిళతల్లి ప్రార్థనా గీతం (తమిళ్ తాయ్ వాఴ్తు) ఆలపించిన తర్వాత జాతీయగీతాన్ని పాడాలని గవర్నర్ సభాపతిని కోరారు. అయితే, దీనికి నిరాకరణ తెలపడంతో ఆయన అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని సమాచారం. అన్ని రాష్ట్ర శాసనసభల్లో గవర్నర్ ప్రసంగానికి ముందు మరియు తర్వాత జాతీయగీతం ఆలపించే సంప్రదాయం ఉందని, ఇక్కడ ఉద్దేశపూర్వకంగా జాతీయగీతాన్ని పాడకుండా చేశారని రాజ్‌భవన్ (లోక్‌భవన్) వివరణ ఇచ్చింది.

రాజ్‌భవన్ విడుదల చేసిన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు: ‘‘తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో జాతీయగీతాన్ని పాడకుండా అవమానించింది. ఇది రాజ్యాంగ ప్రాథమిక విధిని ఉల్లంఘించినట్లు. గవర్నర్ ప్రసంగం సమయంలో మైక్‌ను పదేపదే ఆపేశారు. ఆయనను మాట్లాడనివ్వలేదు. అసెంబ్లీలో జాతీయగీతాన్ని తరచూ అవమానిస్తున్నారు. అంతేకాక, ప్రభుత్వం అందించిన ప్రసంగ కాపీలో అసత్యాలు, నిరాధార విషయాలు ఉన్నాయి. రాష్ట్రంలో దళితులపై జాతి హింస, మహిళలపై లైంగిక హింస వంటి తీవ్ర సమస్యలను ప్రస్తావించలేదు. ఈ కారణాలతో గవర్నర్ ప్రసంగం చదవడానికి నిరాకరించి, సభ నుంచి వెళ్లిపోయారు.’’

ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ‘‘సంప్రదాయం, నైతికతను ఉల్లంఘించి గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేయడం సరికాదు. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ కాపీలో గవర్నర్ అభిప్రాయాలను చేర్చాలనే నిబంధన ఎక్కడా లేదు. ఆర్.ఎన్.రవి ఉద్దేశపూర్వకంగా సభను అవమానించడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.

గతంలోనూ గవర్నర్ ఆర్.ఎన్.రవి ప్రసంగ విషయంలో ఇలాంటి వివాదాలు తలెత్తాయి. ఈ సంఘటన రాష్ట్రంలో గవర్నర్-ప్రభుత్వం మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచినట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News