Chandrababu : పీవీ విధానాల వల్లే దేశంలో ఐటీ విప్లవం వచ్చింది
లైఫ్ అండ్ లెగస్సీ ఆఫ్ పీవీ కార్యక్రమంలో చంద్రబాబు;
ఆర్థిక సంస్కరణలంటే గుర్తోచ్చేది పీవీనరసింహారావే
మాజీ ప్రధాని పీవీనరసింహారావు భారత దేశానికి ఎనలేని సేవలు అందించారని, ఆయన అసాధారణ రాజనీతిజ్ఞుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. లైఫ్ అండ్ లెగససీ ఆఫ్ పీవీ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన ఆరొవ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీయం చంద్రబాబు పీవీ గొప్పతనం గురించి మాట్లాడారు. 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్న పీవీనరసింహారావు సీయంగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఈ దేశానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు అంటే గుర్తుకు వచ్చేది పీవీనే అన్నారు. లైసెన్స్ రాజ్ విధానం నుంచి ఈ దేశాన్ని బయటపడేసి ఆయన తీసుకు వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా గేమ్ ఛేంజర్ గా నిలబడ్డారన్నారు. ఆయన కృషి వల్లే దేశంలో ఐటీ విప్లవం వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. మైనార్టీ ప్రభుత్వంలో కూడా పీవీ చాలా లౌక్యంగా వ్యవహరించి ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపారన్నారు. పీవీ తీసుకు వచ్చిన సంస్కరణలు వాజ్‌పేయి కొనసాగించారని చంద్రబాబు పేర్కొన్నారు.