Supreme Court: సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన.. ఆగ్రహంతో పత్రాలు గాల్లోకి విసిరిన పిటిషనర్
పిటిషనర్
Supreme Court: సుప్రీం కోర్టులో శుక్రవారం అనూహ్య, అప్రతిష్టకర ఘటన చోటు చేసుకుంది. ఒక పిటిషనర్ తన కేసు విచారణ సమయంలో ఆగ్రహం వెల్లడిస్తూ తన కేసుకు సంబంధించిన పత్రాలను గాల్లోకి విసిరేయడంతో కోర్టు హాల్‌లోని అందరూ షాక్‌కు గురయ్యారు.
అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ ఆలోక్ అరాథేలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో తన కేసును స్వయంగా వాదించుకుంటున్న పిటిషనర్ మొదట 'లఖ్‌నవూ ఏసీపీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశించాలి' అని వాదనలు చేశాడు.
దీనిపై న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథన్ "మీరు మాకు ఆదేశాలు ఇస్తున్నారా?" అని ప్రశ్నించగా, పిటిషనర్ "నావైపు నుంచి చెప్పాల్సింది ఇంతే. అన్నీ రికార్డులో ఉన్నాయి" అని బదులిచ్చాడు. అనంతరం ఆగ్రహంతో తన కేసు పత్రాలను గాల్లోకి విసిరేశాడు. ఈ దురుసు ప్రవర్తనపై కోర్టు హాల్‌లో ఉన్న న్యాయమూర్తులు, సిబ్బంది అంతా తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ పిటిషనర్‌ను కోర్టు హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు.