UP ATS Raids Istanbul International Printing Press in Greater Noida: మతవిద్వేషాలు రెచ్చగొట్టే సాహిత్యం ప్రచురణ... గ్రేటర్ నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ప్రింటింగ్ ప్రెస్‌పై యూపీ ఏటీఎస్ దాడులు

గ్రేటర్ నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ప్రింటింగ్ ప్రెస్‌పై యూపీ ఏటీఎస్ దాడులు

Update: 2025-11-19 09:57 GMT

UP ATS Raids Istanbul International Printing Press in Greater Noida: దిల్లీ ఎర్రకోట పేలుడు కేసు, ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉన్న తుర్కియే ఆధారిత టెర్రర్ మాడ్యూల్స్ దర్యాప్తు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ మరో కీలక చర్యకు ఉపక్రమించింది. గ్రేటర్ నోయిడాలోని ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రింటింగ్ ప్రెస్‌పై ఏటీఎస్ అధికారులు దాడులు నిర్వహించి, మత విద్వేషాలు రెచ్చగొట్టే కంటెంట్ ప్రచురణకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ప్రింటింగ్ ప్రెస్‌లో మత ద్వేషాన్ని ప్రేరేపించే పుస్తకాలు, సాహిత్యం ముద్రిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా గుర్తించినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. దాడుల్లో కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్, ముఖ్యమైన డాక్యుమెంట్లు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థకు తుర్కియేతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

దిల్లీ పేలుడు కేసు మాస్టర్‌మైండ్ డా. ఉమర్ ఉన్ నబీ, ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్‌కు చెందిన డా. ముజమ్మిల్ గనాయీలు 2021లో తుర్కియే వెళ్లి జైషే మహమ్మద్ ప్రతినిధులను కలిసినట్లు ఇప్పటికే దర్యాప్తులో తేలింది. అక్కడ విదేశీ హ్యాండ్లర్ ‘ఉకాసా’ను కలిసిన ఉమర్... భారత్‌లో టెర్రర్ మాడ్యూల్ ఏర్పాటు, నిర్వహణపై సూచనలు అందుకున్నాడు. పేలుడు పదార్థాల సేకరణకు తుర్కియే ఆధారిత నెట్‌వర్క్‌ల నుంచి ఆర్థిక సాయం అందిందని అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తుర్కియేతో లింకులు ఉన్న సంస్థలపై ఏటీఎస్ దాడులు ఊపందుకున్నాయి.

ఇటీవలే ఈ ప్రింటింగ్ ప్రెస్ సహ వ్యవస్థాపకుడు ఫర్హాన్ నబీ సిద్దీకీని ఏటీఎస్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హవాలా మార్గాల ద్వారా రూ.11 కోట్లకు పైగా విదేశీ నిధులు అందజేసి, మత ద్వేషం రెచ్చగొట్టే సాహిత్యాన్ని ప్రచురిస్తున్నారనే ఆరోపణలపై అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి తుర్కిష్ భాగస్వామి కోసం గాలింపు కొనసాగుతోంది.

నిందితుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం... తుర్కియే పర్యటన అనంతరం వీరు బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున రసాయనాలు సేకరించారు. 360 కేజీల అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ తదితర పదార్థాలు అల్ ఫలా విశ్వవిద్యాలయం ప్రాంగణం సమీపంలో నిల్వ చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు ఉమర్ ప్రణాళిక రచించినట్లు తేలింది. అయితే ఫరీదాబాద్ కుట్ర బయటపడటంతో భయాందోళనకు గురైన ఉమర్... ఎర్రకోట సమీపంలో ముందుగానే పేలుడు జరిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

పేలుడుకు వారం రోజుల ముందు కశ్మీర్ వెళ్లిన ఉమర్... తన ఫోన్‌ను సోదరుడు జహూర్‌కు అప్పగించాడు. మీడియాలో తన గురించి వార్తలు వస్తే ఫోన్‌ను నీటిలో పారేయాలని సూచించినట్లు జహూర్ విచారణలో అంగీకరించాడు. ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు డేటా పరిశీలిస్తున్నారు.

తుర్కియే ఆధారిత టెర్రర్ లింకులపై కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు తీవ్ర నిఘా పెట్టాయి. ఈ దాడులు, అరెస్టులతో ఉగ్ర మాడ్యూల్స్‌కు చెక్ పడుతుందని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి.

Tags:    

Similar News