U.S. Politics in Silicon Supply: సిలికాన్ సరఫరాలో అమెరికా రాజకీయాలు… భారత్‌ను తప్పించిన ప్యాక్స్ సిలికా
భారత్‌ను తప్పించిన ప్యాక్స్ సిలికా
U.S. Politics in Silicon Supply: కృత్రిమ మేధ (ఏఐ) అభివృద్ధికి కీలకమైన సిలికాన్ సరఫరా గొలుసును భద్రపరచడం, చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం లక్ష్యంగా అమెరికా విదేశాంగ శాఖ ‘ప్యాక్స్ సిలికా’ (Pax Silica) అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కూటమిలో జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, నెదర్లాండ్స్, యూనైటెడ్ కింగ్‌డమ్, ఇజ్రాయెల్, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాలు భాగస్వామ్యమయ్యాయి. అయితే, ఈ జాబితాలో భారత్‌కు స్థానం దక్కకపోవడం చర్చనీయాంశమైంది.
అమెరికా రాష్ట్ర విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. సిలికాన్ సరఫరాపై ఇతర దేశాలపై బలవంతపు ఆధారపడటాన్ని నివారించడం, ఏఐ సాంకేతికతలను రక్షించడం, మిత్ర దేశాల మధ్య సహకారాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. కీలక ఖనిజాల నుంచి అధునాతన తయారీ, సెమీకండక్టర్లు, ఏఐ మౌలిక సదుపాయాల వరకు సురక్షిత గొలుసును నిర్మించడం దీని లక్ష్యం.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ.. హైటెక్ సరఫరా గొలుసుల్లో చైనా ప్రాబల్యాన్ని అరికట్టేందుకు అమెరికా ఈ చొరవ తీసుకుందని, ఇందులో భారత్ భాగమై ఉంటే దేశానికి ఎంతో లాభదాయకంగా ఉండేదని అన్నారు. ఇటీవల మోదీ-ట్రంప్ సంబంధాల్లో ఏర్పడిన అపార్థాలు, ద్వైపాక్షిక చర్చల్లో ఫలితాలు లేకపోవడమే ఈ మినహాయింపుకు కారణమని ఆయన ఎద్దేవా చేశారు. గురువారం మోదీ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ఎక్స్‌లో పోస్టు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది భారత్‌లో ‘ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026’ నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమిట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తొలిసారిగా భారత్‌లో ఈ సదస్సు జరగనుంది.