Kerala Chief Minister: కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

Update: 2026-05-18 08:08 GMT

Kerala Chief Minister: కేరళలో కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులు కూడా ఒకేసారి ప్రమాణం చేశారు. దీంతో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) తిరిగి అధికారంలోకి వచ్చింది.

తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, సీఎం సతీశన్ ఆర్థిక శాఖ, ఓడరేవులు సహా పలు కీలక శాఖలను తన వద్దనే ఉంచుకోనున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలకు హోం, విజిలెన్స్ శాఖలు అప్పగించే అవకాశం ఉంది. కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌కు రెవెన్యూ శాఖ కేటాయించాలని యూడీఎఫ్ నిర్ణయించింది.

సతీశన్ రాజకీయ ప్రయాణం

1964లో కొచ్చి సమీపంలోని నెట్టూర్‌లో జన్మించిన వీడీ సతీశన్ వృత్తిరీత్యా న్యాయవాది. సామాజిక కార్యకర్తగా కూడా పేరు తెచ్చుకున్న ఆయన రాజకీయాల్లో కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్‌యూ) నుంచి ప్రారంభించి, యూత్ కాంగ్రెస్ ద్వారా ముందుకు వచ్చారు. కాంగ్రెస్‌లో వివిధ స్థాయిల్లో పనిచేసి, సంస్కరణావాది, ప్రజానేతగా ఎదిగారు.

2001లో పరావూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు విజయం సాధించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ విపక్షానికి పరిమితమైనా, ప్రతిపక్ష నేతగా పినరయి విజయన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించి, అవినీతి, గోల్డ్ స్మగ్లింగ్, పరిపాలనా వైఫల్యాలను ఎత్తి చూపారు. ఏఐసీసీ పరిశీలకుల అభిప్రాయ సేకరణలో కూడా ఎమ్మెల్యేలు, ప్రజల మద్దతు ఆయనకే లభించింది.

ఈ కొత్త ప్రభుత్వం కేరళ అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News