PM Modi Suggests: జల వివాదాలు సహకారంతో పరిష్కరించుకోవాలి.. కెన్-బెట్వా ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకోండి: ప్రధాని మోదీ సూచన

కెన్-బెట్వా ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకోండి: ప్రధాని మోదీ సూచన

Update: 2026-05-29 10:52 GMT

PM Modi Suggests: అంతర్రాష్ట్ర జల వివాదాలను రాష్ట్రాలు పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన సూచనలు చేశారు. ప్రాజెక్టులకు సకాలంలో అనుమతులు ఇవ్వడం, సాంకేతిక పర్యవేక్షణ పెంచడం ద్వారా సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు. ఈ విషయంలో కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

బుధవారం రాత్రి దిల్లీలో ‘ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్‌లీ ఇంప్లిమెంటేషన్’ (ప్రగతి) 51వ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. రైల్వే, విద్యుత్, రహదారుల రంగాల్లో తొమ్మిది రాష్ట్రాల్లో సుమారు రూ.30,000 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు.

ప్రాజెక్టులు నిర్ణీత గడువులో పూర్తి కాకపోతే ఖర్చు పెరగడమే కాకుండా, ప్రజలు సదుపాయాలను సకాలంలో వినియోగించుకోలేకపోతారని ప్రధాని హెచ్చరించారు. నదుల అనుసంధానం, జల సంరక్షణ, భూగర్భజలాల రీఛార్జింగ్, సమర్థవంతమైన సాగునీటి వినియోగం వంటి రంగాల్లో కెన్-బెట్వా మాదిరిగా రాష్ట్రాలు అవకాశాలను గుర్తించాలని సూచించారు.

సౌర విద్యుత్‌పై దృష్టి

నగరాలు, పట్టణాల్లో ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ప్రోత్సహించాలని మోదీ సూచించారు. ముఖ్యంగా నివాస సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలపై దృష్టి పెట్టాలన్నారు. ఇది విద్యుత్ వ్యయాన్ని తగ్గించి, శుద్ధ ఇంధన వాడకాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు.

వధావాన్ ఓడరేవు (మహారాష్ట్ర)ను అత్యాధునిక సమగ్ర రవాణా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద ఘన వ్యర్థాల నిర్వహణను వేగవంతం చేయాలని, పౌరుల భాగస్వామ్యం పెంచాలని సూచించారు.

పంట కాలువలపై సౌర విద్యుత్ ప్యానెళ్లు అమర్చడం ద్వారా నీటి ఆవిరి అయ్యే సమస్యను కూడా అరికట్టవచ్చని ప్రధాని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News