Women’s Reservation Law: మహిళా రిజర్వేషన్ చట్టం: 21వ శతాబ్దపు అతి ముఖ్యమైన చారిత్రక నిర్ణయం- ప్రధాని నరేంద్ర మోదీ
21వ శతాబ్దపు అతి ముఖ్యమైన చారిత్రక నిర్ణయం
Women’s Reservation Law: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడం 21వ శతాబ్దంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయాల్లో ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ పార్లమెంటు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోందని, దశాబ్దాల నిరీక్షణకు ఈ నెల 16, 17, 18 తేదీల్లో తెరపడనుందని వ్యాఖ్యానించారు.
విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళనం’లో మహిళా ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. 2023లో కొత్త పార్లమెంటు భవనంలో తొలి బిల్లుగా ‘నారీ శక్తి వందన అధినియమ్’ను ఆమోదించి మొదటి అడుగు వేశామని గుర్తు చేశారు. ఆ చట్టాన్ని త్వరగా అమలు చేయడానికి ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నామని ప్రకటించారు.
“సామాజిక న్యాయం కేవలం నినాదం కాదు, అది మన పని సంస్కృతిలో భాగం అని ఈ చట్టం ద్వారా నిరూపిస్తున్నాం. రాష్ట్ర అసెంబ్లీల నుంచి పార్లమెంటు వరకు దశాబ్దాలుగా కొనసాగుతున్న నిరీక్షణకు తెరపడనుంది” అని మోదీ అన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించేలా చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశాయని, వారి అభిప్రాయాలను స్వీకరించి మేధోమథనం చేశామని ప్రధాని తెలిపారు. అందరి సహకారంతో ఈ చట్టాన్ని ఏకాభిప్రాయంతో ఆమోదించి, దేశ చరిత్రలో కొత్త అధ్యాయం రాయాలని పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం మహిళా శక్తికి, వారి గౌరవానికి అంకితమని, భవిష్యత్ తరాలకు సమానత్వపు భారత్‌ను అందించే మార్గం అని వివరించారు.
సమ్మేళనంలో బీజేపీ నాయకురాలు సావిత్రీ ఠాకుర్, కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ మహిళా ప్రతినిధులకు నమస్కరించి, వారి సలహాలు, సూచనలను స్వీకరించారు.
ఈ చట్టం అమలుతో దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగి, మహిళా నేతృత్వ అభివృద్ధి వేగం పుంజుకోనుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అందరి సహకారంతో ఈ చారిత్రక సవరణలు ఆమోదం పొందాలని ఆకాంక్షించారు.