AP Revenu reforms: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు
అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చే ప్రతిపాదన;
రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని, పేద ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యమని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన రెవెన్యూ శాఖ సమీక్ష అనంతరం అనగాని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలపై ఆర్థిక భారం తగ్గించే పలు సంస్కరణలను ప్రకటించారు. ఇకపై కేవలం రూ.100 నామమాత్రపు రుసుముతో వారసత్వ ధృవీకరణ పత్రం జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
పేదలకు భారీ ఊరట : గ్రామాల్లో తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు వారసత్వ బదలాయింపులు సరిగ్గా జరగకపోవడమే ప్రధాన కారణమని మంత్రి అనగాని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రూ.10 లక్షల లోపు మార్కెట్ విలువ ఉన్న భూములకు వారసత్వ ధృవీకరణ పత్రం (Succession Certificate) కేవలం రూ.100కే అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రూ.10 లక్షలు దాటిన ఆస్తులకు ఈ రుసుము రూ.1000గా ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ కోసం ప్రజలు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయాల స్థాయిలోనే పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ఇది పేదలకు ప్రభుత్వం ఇస్తున్న గొప్ప వరమని అభివర్ణించారు.
ఆగస్టు 15న కొత్త పాసు పుస్తకాలు
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆగస్టు 15వ తేదీన పండుగ వాతావరణంలో క్యూఆర్ కోడ్, మ్యాప్‌తో కూడిన నాణ్యమైన పట్టాదారు పాసు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, లొకేషన్, విస్తీర్ణం వంటివి వెంటనే తెలుసుకోవచ్చని వివరించారు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒక వ్యక్తికి రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములున్నాయో తెలిసేలా టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నామన్నారు. పాసు పుస్తకం లేని కారణంగా బ్యాంకు రుణాలు ఆగవని, ఆన్‌లైన్‌లో వివరాలు చూసి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయని, దీనిపై అపోహలు వద్దని ఆయన స్పష్టం చేశారు.
పేదలు, జర్నలిస్టులకు ఇళ్లపై ప్రత్యేక దృష్టి
'హౌసింగ్ ఫర్ ఆల్' ప్రభుత్వ లక్ష్యమని, రెండేళ్లలో ప్రతి పేదవాడికి ఇంటి స్థలం, మూడేళ్లలో ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అనగాని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పేదలతో పాటు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు తనతో పాటు గృహనిర్మాణ, పురపాలక శాఖ మంత్రులతో ఒక కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని హామీ ఇచ్చారు.
రీసర్వే, టెక్నాలజీ వినియోగం
గత ప్రభుత్వ హయాంలో రీసర్వే పేరుతో జరిగిన అశాస్త్రీయ విధానాలకు స్వస్తి పలికి, పారదర్శకమైన రీతిలో రీసర్వే చేపడుతున్నామని మంత్రి తెలిపారు. బ్లాక్ సిస్టమ్ విధానంలో, డ్రోన్లు, జియో-కోఆర్డినేట్స్ వంటి ఆధునిక టెక్నాలజీని వాడుతూ భూ యజమాని సమక్షంలోనే సర్వే చేస్తున్నట్లు వివరించారు. డిసెంబర్ 2027 నాటికి రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, అటవీ, జలవనరుల భూములను వేర్వేరు రంగులతో మ్యాపింగ్ చేస్తున్నామని, ఇది దేశంలోనే ఆదర్శవంతమైన విధానమని అన్నారు.
అవినీతిపై ఉక్కుపాదం, పరిపాలనలో మార్పులు
రెవెన్యూ శాఖలో అవినీతిని ఏమాత్రం సహించబోమని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని మంత్రి హెచ్చరించారు. అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు కోసం ప్రజలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ రద్దు చేసేలా అధికారం ఇచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. ఇకపై మంత్రుల పర్యటనల సమయంలో ప్రోటోకాల్ విధులకు సంబంధిత శాఖల అధికారులే హాజరవుతారని, తహసీల్దార్, ఆర్డీవోలు తమ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు.
నాలా కన్వర్షన్ ఫీజును 4 శాతం ఫ్లాట్‌గా నిర్ణయించే ప్రతిపాదన తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందే అవకాశం ఉందని, అలాగే ఫ్రీహోల్డ్ భూముల సమస్యలపై మంత్రుల బృందం అధ్యయనం చేసి అక్టోబర్ 2 నాటికి నివేదిక ఇస్తుందని మంత్రి అనగాని సత్య ప్రసాద్ వివరించారు.