Supreme Court Collegium Recommends: సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్!

Update: 2026-02-28 03:15 GMT

Supreme Court Collegium Recommends: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లిసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే, ఏపీ హైకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ నిలిచిపోతారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో గురువారం జరిగిన కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ పదవీ విరమణ ఏప్రిల్ 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో రెండు నెలల ముందుగానే కొత్త సీజేను బదిలీ చేసి సిద్ధం చేయాలని కొలీజియం కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.

ఈ విధానం ప్రకారం జస్టిస్ లిసా గిల్‌ను పంజాబ్-హరియాణా హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేసి, ప్రస్తుత సీజే పదవీ విరమణ తర్వాత ఆమెను ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేశారు. దీంతో ఆమె హైకోర్టు వాతావరణానికి, పరిపాలనా విధానాలకు ముందస్తుగా అలవాటు పడే అవకాశం ఉంటుందని కొలీజియం తన ప్రకటనలో పేర్కొంది. ఇది న్యాయ వ్యవస్థ సామర్థ్యం, నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన కొత్త విధానం.

జస్టిస్ లిసా గిల్ స్వస్థలం చండీగఢ్. కార్మెల్ కాన్వెంట్ స్కూల్‌లో పాఠశాల విద్య, ప్రభుత్వ మహిళా కాలేజీలో హ్యుమానిటీస్‌లో డిగ్రీ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం చేశారు. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని పంజాబ్-హరియాణా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. చండీగఢ్ ప్రభుత్వం, పలు ప్రభుత్వ రంగ బోర్డులు, కార్పొరేషన్లకు దీర్ఘకాలం న్యాయ ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ సీనియారిటీ పరంగా మూడో స్థానంలో ఉన్నారు.

ఈ కొత్త విధానంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బాధ్యతల సాఫీగా జరిగేలా చూడటం లక్ష్యంగా కొలీజియం చర్యలు చేపట్టింది. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందే అవకాశం ఉందనే చర్చలు కూడా జరుగుతున్నాయి.

Tags:    

Similar News