షీ జాబ్స్‌ స్ఫూర్తితో సీతా యాప్‌ - ప్రారంభోత్సవంంలో నిర్వాహకులు

Sita App inspired by She Jobs - Organizers at the launch ceremony;

Update: 2025-06-11 07:09 GMT

షీ జాబ్స్‌ స్ఫూర్తితో మహిళల కోసం ప్రత్యేకంగా సీతా యాప్‌ రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే టెక్ రంగంలో మహిళలను మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రారంభించిన షీ జాబ్స్‌కు పెద్ద స్పందన వచ్చిందని వ్యవస్థాపకురాలు స్వాతి తెలిపారు. అయితే, చాలామంది మహిళలు టైలరింగ్, ట్యూటరింగ్, పెయింటింగ్ వంటి నాన్‌-ఐటీ పనుల్లో నిపుణులుగా ఉన్నారని, వాళ్ల స్కిల్స్‌కు కూడా మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతోనే సీతా యాప్‌ రూపొందించామని వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సీతా యాప్‌ను ప్రముఖ సినీ నటి శ్రీలీల, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దర్శకుడు హరీష్ శంకర్ తదితరులు కలిసి ప్రారంభించారు. ఈ యాప్‌ మహిళలు తమ స్కిల్స్‌ను ఉపాధిగా మలుచుకునేలా, ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడేలా చేయడమే లక్ష్యంగా అభివృద్ధి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. సీతాదేవి ప్రతి మనిషికి స్పూర్తి అని, ప్రతి మహిళలో ఓ సీత ఉన్నట్టు, ఆమె ఓ హీరో అని, దీన్ని మత పరంగా కాకుండా, ప్రతి మహిళా శక్తిగా చూడాలని యాప్‌ రూపకర్త స్వాతి సూచించారు.

గ్రామీణ ప్రాంతాల మహిళలు కూడా ఉపయోగించగలిగేలా, వాట్సాప్, ఫోన్ కాల్ సపోర్ట్ ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుందని చెప్పారు. టెక్నికల్‌గా కాస్త వెనుకబడినవారికీ సహాయం చేస్తామని, రంగోలీ, ఫుడ్‌ ప్రొడక్ట్స్, హస్తకళలు వంటి అనేక విభాగాల్లో వారి సేవలను ఈ యాప్‌లో నమోదు చేసుకునే వీలుంటుందని వివరించారు.

ట్యూటరింగ్, బ్యూటీ సర్వీసెస్, హోమ్ ఫుడ్, హస్తకళలు మొదలైన 20కిపైగా ఉపాధి అవకాశాలు ఈ యాప్‌తో ఉన్నాయని, అలాగే, ట్రాన్స్‌జెండర్స్, స్పెషల్ నీడ్ మహిళలకూ అవకాశాలు కల్పించేలా దీన్ని తీర్చిదిద్దామని, దేశవ్యాప్తంగా ఉచిత లీడ్స్, బ్రాండింగ్ సపోర్ట్ ఇస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. మొత్తానికి సీతా యాప్‌.. ఆదాయ మార్గాలు, ఆత్మస్థైర్యం కల్పించే మిషన్ అని చెప్పారు.



Tags:    

Similar News