Sachin Tendulkar: అతను ఆటకు గుడ్‌బై చెప్పి దాదాపు పదమూడేళ్లు అవుతోంది. కానీ, క్రీడా ప్రపంచంలో, వ్యాపార ప్రకటనల రంగంలో ఆయన క్రేజ్ మాత్రం అణుమాత్రం కూడా తగ్గలేదు. ఆయనే భారత క్రికెట్ రత్నం.. కోట్లాది మంది అభిమానుల 'క్రికెట్ దేవుడు' సచిన్ రమేష్ టెండూల్కర్!ప్రస్తుతం క్రికెట్‌లో ఎంతోమంది యువ సంచలనాలు, స్టార్ ఆటగాళ్లు దూసుకుపోతున్నప్పటికీ.. బ్రాండ్ వాల్యూ విషయంలో మాత్రం సచిన్ మానియానే వేరు.

తాజాగా విడుదలైన 'క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్' నివేదిక క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్రాండ్ విలువ ఏకంగా 125.9 మిలియన్ అమెరికన్ డాలర్లు.. అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ. 1,189 కోట్లుగా నమోదైంది! ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు.. దేశంలోని టాప్-5 సెలబ్రిటీ బ్రాండ్లలో ఒకటిగా సచిన్ నిలవడానికి నిదర్శనం.

అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుత భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలతో పోలిస్తే.. పలు రంగాల్లో సచిన్ ఇంకా ఎక్కువ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతదేశంలోని టాప్-10 సెలబ్రిటీ బ్రాండ్ల జాబితాలో నిరంతరం కొనసాగుతున్న ఏకైక రిటైర్డ్ క్రీడాకారుడు సచిన్ మాత్రమే కావడం విశేషం.

అంతర్జాతీయ క్రికెట్‌లో 24 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో 34 వేలకు పైగా పరుగులు, వంద సెంచరీల మైలురాయిని దాటిన సచిన్.. మైదానంలో ఎంతటి లెజెండో, మైదానం వెలుపల నమ్మకానికి అంతకంటే క్రికెట్ గాడ్ గా ప్రతిరూపంగా నిలిచారు. ప్రజల్లో ఆయనపై ఉన్న అపారమైన నమ్మకం, విశ్వసనీయత, చెరగని గౌరవమే ఈ బ్రాండ్ విలువ ఏటా అంతకంతకూ పెరిగేలా చేస్తున్నాయి.

Tags: