Romario Shepherd: ఒకే బంతికి 20 పరుగులు: సీపీఎల్‌లో రొమారియో షెఫర్డ్ అద్భుతం
సీపీఎల్‌లో రొమారియో షెఫర్డ్ అద్భుతం;
Romario Shepherd: వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరఫున ఆడుతున్న ఈ భారీ హిట్టర్, సెయింట్ లూసియా జట్టుతో జరిగిన ఒక మ్యాచ్‌లో ఒకే బంతికి ఏకంగా 20 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. ఈ అసాధారణ ఘటన 15వ ఓవర్‌లో చోటుచేసుకుంది. బౌలర్ థామస్ వేసిన మూడో బంతి నోబాల్‌గా వెళ్లగా, షెఫర్డ్ ఎలాంటి పరుగులు తీయలేదు. ఆ తర్వాత వచ్చిన ఫ్రీహిట్‌ను షెఫర్డ్ భారీ సిక్సర్‌గా మలిచాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ బంతి కూడా నోబాల్‌గా తేలింది. దీంతో మరో ఫ్రీహిట్ లభించింది. దాన్ని కూడా షెఫర్డ్ బౌండరీ లైన్ ఆవలకు పంపించాడు. కానీ అది కూడా నోబాల్‌గా ప్రకటించారు. చివరగా మూడో ఫ్రీహిట్‌ను కూడా షెఫర్డ్ సునాయాసంగా సిక్స్‌గా మార్చాడు. ఇలా ఒకే లీగల్ డెలివరీకి మొత్తం 20 పరుగులు వచ్చాయి.
ఈ ఇన్నింగ్స్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షెఫర్డ్ 34 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు, ఇందులో ఏడు సిక్స్‌లు ఉన్నాయి. షెఫర్డ్ గత ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. చెన్నైతో జరిగిన ఓ మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ 13 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి తొలి స్థానంలో ఉన్నాడు.