2026 T20 World Cup: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. మాజీ ఇంగ్లాండ్ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు

మాజీ ఇంగ్లాండ్ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు

Update: 2026-02-05 05:45 GMT

2026 T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన అత్యంత కీలకమైన గ్రూప్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచర్, ఇది భారత్‌కు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కి పెద్ద ఆర్థిక విపత్తు అని అభివర్ణించారు.

బంగ్లాదేశ్ జట్టుకు మద్దతుగా పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌ను ఐసీసీ టోర్నీ నుండి తొలగించి, ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ 'ముస్లిం సోదర దేశం' పట్ల ఐసీసీ వివక్ష చూపిస్తోందని, గతంలో భారత్ పాకిస్తాన్‌కు వెళ్లనప్పుడు హైబ్రిడ్ మోడల్ ప్రవేశపెట్టిన ఐసీసీ, ఇప్పుడు బంగ్లాదేశ్‌కు ఎందుకు ఆ మినహాయింపు ఇవ్వలేదని పాక్ ప్రశ్నిస్తోంది.

ఈ పరిణామాలపై మార్క్ బుచర్ ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. "క్రికెట్ ప్రపంచంలో భారత్ అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన దేశం. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్తాన్‌కు వెళ్లనప్పుడు, ఐసీసీ మొత్తం షెడ్యూల్‌ను మార్చి భారత్ కోసం దుబాయ్‌లో మ్యాచ్‌లు నిర్వహించింది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో అదే మర్యాదను పాటించలేదు. అందుకే పాకిస్తాన్ తమ 'ముస్లిం సోదరభావం' చాటుకుంటూ భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. ఇది ఐసీసీకి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ" అని విశ్లేషించారు.

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే వేల కోట్ల రూపాయల వ్యాపారమని, అందుకే ఐసీసీ కావాలనే ఈ రెండు జట్లను ఒకే గ్రూపులో ఉంచుతుందని బుచర్ పేర్కొన్నారు. ఇది యాదృచ్ఛికం కాదని, కేవలం ఆదాయం కోసమే పైస్థాయిలో తీసుకునే నిర్ణయమని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే బ్రాడ్ కాస్టర్ల నుండి ఐసీసీ భారీ చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, పాకిస్తాన్‌కు ఇచ్చే వార్షిక ఆదాయ వాటాను ఐసీసీ నిలిపివేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి ఐసీసీ తెరవెనుక చర్చలు జరుపుతోంది.

Tags:    

Similar News