AB de Villiers: ఇంకా ఎందుకు ఆపడం? వైభవ్ సూర్యవంశీకి మద్దతుగా నిలిచిన మిస్టర్ 360!
మిస్టర్ 360!
AB de Villiers: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచం రెండుగా చీలిపోయింది! ఒకవైపు సంజు శాంసన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలం కావడంతో.. వైభవ్‌ను వెంటనే తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. కానీ, మేనేజ్‌మెంట్ మాత్రం అతడికి ఇప్పుడే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని అలవాటు చేయాలని భావిస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు వైభవ్ సిద్ధంగా ఉన్నా.. టీమ్‌లోకి రావడానికి అందరికీ ఒకే రకమైన ప్రాసెస్ ఉంటుందని భారత అసిస్టెంట్ కోచ్ డస్కటే స్పష్టం చేశాడు. ఇప్పటికే ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ డెబ్యూ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశాడు.అయితే.. కోచ్ చేసిన ఈ వ్యాఖ్యలను దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తీవ్రంగా విభేదించాడు. వైభవ్‌కు మద్దతుగా నిలుస్తూ భారత మేనేజ్‌మెంట్ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
"అసలు వైభవ్‌ను ఎప్పుడు బరిలోకి దింపుతారు? ఐర్లాండ్‌తో సిరీస్ అతడికి ఒక అద్భుతమైన అవకాశం. కానీ, ఆడించలేదు.. అది అత్యంత దురదృష్టకరం. సూర్యవంశీ కూడా అందరిలాగే ప్రాసెస్ ఫాలో అవ్వాలన్న కోచ్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ఐపీఎల్‌లో అతడి విధ్వంసకర ఆటను చూశాక కూడా ఇంకా ఎందుకు ఆపడం? ఐర్లాండ్‌పై ఆడిస్తే కాస్త అనుభవం వచ్చేది. పైగా ఆ సిరీస్‌ను భారత్ ఓడిపోయింది. ఇటు ఇంగ్లాండ్‌తో తొలి టీ20 కూడా వర్షం వల్ల రద్దయింది."
యూకే టూర్‌లో భారత్ బలంగా పుంజుకోవాలని డివిలియర్స్ సూచించాడు. అక్కడ ఇంగ్లాండ్ పిచ్‌లపై ప్రతి మ్యాచ్‌లోనూ 250 లేదా 260 పరుగులు చేయడం సాధ్యం కాదని.. 160 రన్స్ చేసినా అది మంచి స్కోరే అవుతుందని, దానికి తగ్గట్టుగా దూకుడుగా వ్యూహాలను అమలు చేయాలని టీమ్‌ఇండియాకు సలహా ఇచ్చాడు.