Former Pakistan captain Shahid Afridi: మళ్ళీ నోరు పారేసుకున్న అఫ్రిది.. భారత్‌ను లాగుతూ సంచలన వ్యాఖ్యలు!
భారత్‌ను లాగుతూ సంచలన వ్యాఖ్యలు!
Former Pakistan captain Shahid Afridi: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. 2026 టీ20 ప్రపంచకప్ నుండి బంగ్లాదేశ్ తప్పుకోవడం, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసీసీ చేర్చడంపై స్పందిస్తూ.. అఫ్రిది అనవసరంగా భారత్‌ను ఈ వివాదంలోకి లాగారు. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ కఠినంగా వ్యవహరించిందని, అదే సమయంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వచ్చేందుకు నిరాకరించిన భారత్ పట్ల మాత్రం ఐసీసీ మెతకవైఖరి ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు.
సోషల్ మీడియా వేదికగా అఫ్రిది తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ.. "ఒక మాజీ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఐసీసీ ప్రదర్శిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు నన్ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. 2025లో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించి భారత్ చెప్పిన భద్రతా సాకులను అంగీకరించిన ఐసీసీ, బంగ్లాదేశ్ విషయంలో మాత్రం అదే అవగాహనను ఎందుకు చూపడం లేదు?" అని ప్రశ్నించారు. ఐసీసీ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, కేవలం బీసీసీఐ (BCCI) ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఆయన విమర్శించారు. క్రికెట్ అభివృద్ధికి వంతెనలు కట్టాల్సింది పోయి, ఐసీసీయే వాటిని కూల్చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఐసీసీ మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేసింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో తాము మూడు వారాల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపామని, భారత్‌లో వారికి ఎలాంటి భద్రతా ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే షెడ్యూల్ మార్పు సాధ్యం కాదని తేల్చి చెప్పామని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ స్వయంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నందునే, వేరే దారి లేక స్కాట్లాండ్‌ను ఎంపిక చేసినట్లు ఐసీసీ వివరించింది. అఫ్రిది వాదనలు కేవలం రాజకీయ కోణంలో ఉన్నాయని, బంగ్లాదేశ్ వ్యవహారంలో ఉన్న వాస్తవాలను ఆయన విస్మరిస్తున్నారని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.