Team India Captain Suryakumar Yadav (SKY): ఎనిమిది మ్యాచ్‌ల్లో డకౌట్ అయినా.. ఫైనల్‌లో నువ్వే ఓపెనర్!
ఫైనల్‌లో నువ్వే ఓపెనర్!
Team India Captain Suryakumar Yadav (SKY): సిరీస్ ఆరంభంలో వరుస విఫలాలతో సతమతమైనా, ఫైనల్‌లో చెలరేగి ఆడిన అభిషేక్ శర్మపై టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY) ప్రశంసల వర్షం కురిపించారు. అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిషేక్ శర్మకు తాను ఇచ్చిన భరోసా గురించి సూర్య ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు వరకు అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగించింది. వరుసగా తక్కువ స్కోర్లకే అవుట్ అవుతున్నా, కెప్టెన్ సూర్యకుమార్ మాత్రం అతనిపై నమ్మకం ఉంచారు. "అభిషేక్ శర్మకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. అతను క్రీజులో ఆరు లేదా ఎనిమిది ఓవర్లు ఉన్నాడంటే చాలు.. మ్యాచ్ మనవైపే ఉంటుంది. నేను ఒకసారి అతనితో చెప్పాను: ఈ వరల్డ్ కప్‌లో 9 మ్యాచ్‌లు ఉన్నాయి. నువ్వు మొదటి 8 మ్యాచ్‌ల్లో సున్నాకే అవుట్ అయినా పర్వాలేదు.. ఫైనల్‌లో మొదటి బంతి నువ్వే ఎదుర్కొంటావని నేను గ్యారెంటీ ఇస్తున్నాను" అని సూర్య వెల్లడించారు.
ఫైనల్‌లో ఊచకోత.. 18 బంతుల్లోనే 50!
కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని అభిషేక్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లపై విరుచుకుపడి కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ 6 ఓవర్లలోనే 90 పరుగులు చేయడంలో అతని పాత్ర కీలకం. "అభిషేక్ చాలా కష్టపడ్డాడు. ఫైనల్‌లో అతను ఆడిన తీరు మ్యాచ్‌ను పూర్తిగా మార్చేసింది. ఇలాంటి ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం" అని సూర్య పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ 255 పరుగుల భారీ స్కోరు సాధించి, న్యూజిలాండ్‌ను 159 పరుగులకే కట్టడి చేసి చరిత్ర సృష్టించింది. స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తొలి జట్టుగా, వరుసగా రెండోసారి టైటిల్ సాధించిన జట్టుగా భారత్ రికార్డు కెక్కింది.