All Set for Second Test: రెండో టెస్టుకు అంతా సిద్ధం.. జడేజా.. కుల్దీప్‌పైనే విండీస్ బ్యాటర్ల ఫోకస్..

కుల్దీప్‌పైనే విండీస్ బ్యాటర్ల ఫోకస్..

Update: 2025-10-09 11:52 GMT

All Set for Second Test: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను కోల్పోకుండా ఉండాలంటే విండీస్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు అత్యంత కీలకం. అయితే తొలి టెస్టులో భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమై, ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైన ఆ జట్టుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలవడం పెద్ద సవాలుగా మారింది.

విండీస్‌ వ్యూహం: లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లపైనే దృష్టి

రెండో టెస్టులోనైనా మెరుగ్గా రాణించాలంటే వెస్టిండీస్ బ్యాటింగ్ విభాగం తప్పక పుంజుకోవాలి. ముఖ్యంగా భారత స్పిన్ ఎటాక్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి. అందుకే విండీస్ ఆటగాళ్లు ఇప్పుడు స్పిన్ బౌలింగ్‌ను ఆడటంపై దృష్టి సారించారు. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడానికి వెస్టిండీస్ టీమ్ తీవ్రంగా కసరత్తు చేసింది. తమ జట్టులోని ఎడమచేతివాటం స్పిన్నర్లు జోమెల్ వారికన్, ఖారీ పియరీతో ఎక్కువ బంతులు వేయించుకుంటూ బ్యాటర్లు ప్రాక్టీస్ చేశారు.

స్పిన్నర్లే ప్రమాదకరం

తొలి టెస్టులో భారత్ తీసిన 20 వికెట్లలో సరిగ్గా సగం స్పిన్నర్ల ఖాతాలోనే పడ్డాయి. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా (4/54) దెబ్బకు విండీస్ విలవిల్లాడింది. మొత్తం పది వికెట్లలో ఏడు వికెట్లు స్పిన్నర్లే తీశారు. ఢిల్లీ పిచ్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, స్పిన్నర్లకు కూడా సహకరిస్తుందని పిచ్ రిపోర్ట్ చెబుతోంది. దీంతో భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. జడేజా, కుల్దీప్‌ను ఎదుర్కోవడానికే విండీస్ జట్టు తమ బ్యాటర్లకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లతో ఎక్కువ ప్రాక్టీస్ చేయించింది.

Tags:    

Similar News