Shikhar Dhawan: శిఖర్ ధావన్‌కు భారీ ఊరట: రూ. 5.7 కోట్లు తిరిగి ఇచ్చేయాలని మాజీ భార్యకు ఢిల్లీ కోర్టు ఆదేశం
రూ. 5.7 కోట్లు తిరిగి ఇచ్చేయాలని మాజీ భార్యకు ఢిల్లీ కోర్టు ఆదేశం
Shikhar Dhawan: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు న్యాయపోరాటంలో పెద్ద విజయం దక్కింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఆస్తి సెటిల్‌మెంట్‌కు సంబంధించి ధావన్ చెల్లించిన రూ. 5.7 కోట్లను (8,94,397 ఆస్ట్రేలియన్ డాలర్లు) తిరిగి ఇచ్చేయాలని అతని మాజీ భార్య అయేషా ముఖర్జీని ఢిల్లీలోని పాటియాలా హౌస్ ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జడ్జి దేవేందర్ కుమార్ గార్గ్ కీలక తీర్పు వెలువరించారు.
ఆస్ట్రేలియా కోర్టు ద్వారా జరిగిన ఈ ఆస్తి పంపకాల ఒప్పందం చెల్లదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. ధావన్‌ను భయపెట్టి, మోసపూరిత పరిస్థితుల్లో సంతకాలు చేయించుకున్నారని ధావన్ తరపు న్యాయవాదులు వాదించగా, కోర్టు దానిని ఏకీభవించింది. వివాహం భారత్‌లో రిజిస్టర్ అయినందున, విదేశీ కోర్టులకు ఈ విషయంలో తీర్పు ఇచ్చే అధికారం లేదని కోర్టు అభిప్రాయపడింది. తిరిగి ఇవ్వాల్సిన ఈ మొత్తంపై ధావన్ కేసు ఫైల్ చేసిన నాటి నుండి 9 శాతం వార్షిక వడ్డీని కూడా చెల్లించాలని అయేషాను ఆదేశించింది.
గతంలో ఫిబ్రవరి 2024లో ఆస్ట్రేలియా కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ధావన్ ఆస్తుల్లో అయేషాకు 15 శాతం వాటా దక్కింది. దీనివల్ల ఆమెకు సుమారు రూ. 23 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు, నగదు లభించాయి. అయితే, ఈ తీర్పు భారతీయ వివాహ చట్టాలకు విరుద్ధమని ధావన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఆస్ట్రేలియా చట్టాలు భారత పబ్లిక్ పాలసీకి మరియు హిందూ వివాహ చట్టానికి లోబడి ఉండవని న్యాయమూర్తి స్పష్టం చేశారు.