Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌లో మరో కోచ్ రాజీనామా

మరో కోచ్ రాజీనామా

Update: 2026-07-13 04:24 GMT

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ షేన్ మెక్‌డెర్మోట్ తన పదవికి రాజీనామా చేశారు. వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్ పర్యటనలకు జట్టు సిద్ధమవుతున్న వేళ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. ఏడాది కాలంగా పాకిస్థాన్ జట్టుతో కొనసాగుతున్న మెక్‌డెర్మోట్, రాబోయే పర్యటనలకు జట్టుతో కలిసి వెళ్లడం లేదని సమాచారం. ఆయన రాజీనామాకు గల కారణాలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించలేదు.

ఈ ఖాళీని భర్తీ చేసేందుకు పీసీబీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పాకిస్థాన్ షాహీన్స్ మరియు అండర్-19 జట్లతో పనిచేసిన మన్సూర్ అమ్జాద్‌ను కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. పాకిస్థాన్ జట్టు కరీబియన్ దీవుల్లో రెండు టెస్టులు ఆడేందుకు సోమవారం బయలుదేరుతోంది, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది.

పాకిస్థాన్ క్రికెట్‌లో విదేశీ కోచ్‌లు, ట్రైనర్లు మరియు ఫిజియోలు కారణం చెప్పకుండానే మధ్యలోనే నిష్క్రమించడం ఇది మొదటిసారి కాదు. ఇటీవల హెడ్ కోచ్‌లు గ్యారీ కిర్‌స్టెన్, జాసన్ గిల్లెస్పీతో పాటు ట్రైనర్ క్లిఫ్ డీకన్ కూడా ఇదే విధంగా పదవుల నుంచి తప్పుకున్నారు. గతంలో స్టీవ్ రిక్సన్ బోర్డుతో విభేదాల కారణంగా రాజీనామా చేయడం పాకిస్థాన్ క్రికెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.

Tags:    

Similar News