Andhra Premier League : ఆగస్టు 8వ తేదీ నుంచి ఏపీఎల్‌ మ్యాచులు ప్రారంభం

జూలై 14వ తేదీ వైజాగ్‌లో క్రిడాకారుల వేలం;

Update: 2025-07-12 12:20 GMT

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తరహాలో ఏపీలో ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ నాలుగొవ సీజన్‌ ను విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని ఆంధ్రా క్రికెట్‌ ఆసోసియేషన్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు సుజయకృష్ణ రంగారావు తెలిపారు. శనివారం విశాఖపట్నంలో ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌, ఉపాధ్యక్షుడు పి.వెంకటరామప్రశాంత్‌, కోశాధికారి దండమూడి శ్రీనివాసరావు, కౌన్సిలర్‌ దంతుగౌరు విష్ణుతేజ్‌లతో కలసి సుజయకృష్ణ రంగారావు మీడియాతో మాట్లాడారు. మారుమూల ప్రాంతాల క్రికెట్‌ క్రీడాకారులకు ఏపీఎల్‌ ఒక చక్కటి అవకాశమని సుజయ్‌ కృష్ణ రంగారావు అన్నారు. క్రికెట్‌ లో కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడానికి ఏపీఎల్ మంచి వేదిక అని చెప్పారు. గత ఏపీఎల్‌ 3 సీజన్ల కంటే 4వ సీజన్‌ను ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ తరహాలో విశాఖపట్నంలో నిర్వహిస్తామని సుజయకృష్ణ ప్రకటించారు. గతంలో ఏపీఎల్‌ లో ఆరు ఫ్రాంఛాయిజీలు ఉండేవని ఈ సారి అవి ఏడు ఫ్రాంచాయిజీలు అయ్యాయని తెలిపారు. 75 లక్షలు ఉన్న ఫ్రాంఛాయిజీల ఫీజు ఇప్పడు రెండు కోట్లకు పెరిగిందన్నారు. గత సీజన్లో 430 మంది క్రికెట్‌ క్రీడాకారులు వేలంలో పాల్గొనగా ఇప్పుడు 520 మందికి వేలంలో పాల్గొనే అవకాశం ఇస్తున్నామన్నారు.

ఏపీఎల్‌ ప్లేయర్స్ నీ 4 కేటగిరీలో విభజించడం జరిగిందని సుజయకృష్ణ రంగారావు చెప్పారు. సుమారు 9 మంది టాప్ సీడ్ లో ఉంటారు, వీరు ఇది వరకే ఇండియాకి ఆడిన వాళ్లు, ఐపీఎల్ లో ప్రతిభ కనబరిచిన ప్లేయర్స్ ఉంటారన్నారు. గ్రేడ్ ఏ లో 21 మంది, గ్రేడ్ బి లో 112 మంది, గ్రేడ్ సి 378 మంది వున్నారని తెలిపారు. ఐపీఎల్ లో వైభ‌వ్ సూర్య‌వంశీ లాంటి యంగ్ ప్లేయర్స్ ఏ విధంగా ప్రతిభ కనబరిచారో అలాంటి ప్లేయర్స్ నీ వెలికితీసేందుకు ఇదో చక్కటి ప్లాట్ ఫామ్ అన్నారు. ఈ నెల 14 వ తేదీన ఏపీఎల్ సీజ‌న్ -4 కి సంబంధించి రాడిషన్ బ్లూ లో అక్షన్ జరగబోతుందని చెప్పారు. గత సీజన్ లో 15 మ్యాచ్ లు జ‌రగ్గా, ఈ సీజ‌న్ లో 21 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్ మొత్తం 25 మ్యాచులు జరుగుతాయన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ , రాజ్య స‌భ ఎంపీ సానా సతీష్ మాట్లాడుతూ ఆగస్టు 8 నుంచి ఏపీఎల్ సీజన్-4 మ్యాచ్ లు జరుగుతాయని ప్రకటించారు. ఏపీఎల్ సీజ‌న్ -4 లో 25 మ్యాచులు వైజాగ్ స్టేడియంలోనే జ‌రుగుతాయని తెలిపారు. వ‌చ్చే ఏడాది మంగ‌ళ‌గిరి, వైజాగ్, క‌డ‌ప స్టేడియాల్లో ఏపీఎల్ మ్యాచులు ప్రాంతాల వారీగా నిర్వ‌హిస్తామని పేర్కొన్నారు.స్టీల్ ఎక్చేంజ్ ఆఫ్ ఇండియా, మైత్రి వంటి సంస్థలు ఈసారి ఫ్రాంచైజ్ లుగా ముందుకు రావడం ఏపీఎల్ కు శుభ పరిణామం అని సానా సతీష్‌ అన్నారు.

Tags:    

Similar News