Arjun Tendulkar Wedding: ముంబైలో ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వెడ్డింగ్ వీడియోలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వెడ్డింగ్ వీడియోలు
Arjun Tendulkar Wedding: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. సచిన్ కుమారుడు, యువ ఆల్ రౌండర్ అర్జున్ టెండూల్కర్ తన చిరకాల స్నేహితురాలు, వ్యాపారవేత్త సానియా చందోక్‌ను వివాహం చేసుకున్నారు. ముంబైలో అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. గత ఏడాది ఆగస్టులోనే వీరిద్దరికీ నిశ్చితార్థం జరగగా, గురువారం జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొడుకు పెళ్లిలో సచిన్ టెండూల్కర్ ఎంతో మురిసిపోతూ, నూతన వధూవరులపై పూల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
అర్జున్ భార్య సానియా చందోక్ ముంబైలోని ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె ప్రఖ్యాత వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు కావడమే కాకుండా, స్వయంగా సక్సెస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తున్నారు. టెండూల్కర్ కుటుంబంతో సానియాకు మొదటి నుంచీ మంచి అనుబంధం ఉంది. ఇక క్రికెట్ విషయానికొస్తే, అర్జున్ టెండూల్కర్ ముంబై నుంచి గోవా జట్టుకు మారి డొమెస్టిక్ క్రికెట్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో కూడా ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మారి ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నాడు.
ఈ వేడుకలో క్రికెట్ ప్రపంచానికి చెందిన తారలు మెరిశారు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరై సందడి చేశారు. అలాగే సంగీత్ వేడుకలో అర్జున్ సోదరి సారా టెండూల్కర్ చేసిన డ్యాన్స్ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంటి ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.