Asia Cup 2025: క్రికెట్ చరిత్రలో తొలిసారి..కప్ లేకుండా సెలబ్రేషన్స్
కప్ లేకుండా సెలబ్రేషన్స్
Asia Cup 2025: పాకిస్తాన్ పై మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసియా కప్ ఫైనల్ ట్రోఫీ ప్రదానోత్సవంలో వివాదం చోటు చేసుకుంది. భారత జట్టు ట్రోఫీని తీసుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత ఆటగాళ్లు ఇష్టపడలేదు. ఈ కారణంగా ట్రోఫీని తిరిగి తీసుకెళ్లాల్సి వచ్చింది, భారత జట్టు ట్రోఫీ లేకుండానే తమ విజయోత్సవాలు జరుపుకుంది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం బహుశా ఇదే మొదటిసారి.
ఈ వివాదంపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, "ఒక ఛాంపియన్ జట్టుకు ట్రోఫీని నిరాకరించడం నా క్రికెట్ జీవితంలో ఎప్పుడూ చూడలేదు" అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, తమకు నిజమైన ట్రోఫీలు జట్టు సభ్యులే అని, ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన అన్నారు.
ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ విధించిన 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇంకా రెండు బంతులుండగానే విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, తెలుగు యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ (69 పరుగులు నాటౌట్) అజేయమైన, ఒత్తిడిలో నిలకడైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని అద్భుతమైన ప్రదర్శనతో భారత్ 19.4 ఓవర్లలోనే ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ అద్భుతమైన ప్రదర్శనకు గాను తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ అత్యధిక ఆసియా కప్ టైటిల్స్ గెలుచుకున్న జట్టుగా తన రికార్డును కొనసాగించింది.