Asia Cup Final Clash: ఆసియాకప్ ఫైనల్ పోరు: మరోసారి ఇండియా vs పాకిస్తాన్
మరోసారి ఇండియా vs పాకిస్తాన్
Asia Cup Final Clash: సూపర్ 4లో భాగంగా దుబాయ్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో పాకిస్థాన్ బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడాతో విజయం సాధించి ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయంతో, ఈ టోర్నమెంట్‌లో మూడోసారి భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మరో హై-ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, ఆరంభంలో తడబడినప్పటికీ, చివరి ఓవర్లలో మొహమ్మద్ హారిస్ (31), మొహమ్మద్ నవాజ్ (25) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించాడు.
అనంతరం 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లు పాకిస్థాన్ బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. షమీమ్ హుస్సేన్ (30) ఒంటరిగా పోరాడినా, పాకిస్థాన్ పేసర్లు షాహీన్ షా అఫ్రిది (3/17), హారిస్ రౌఫ్ (3/33) అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్‌ను 124 పరుగులకే పరిమితం చేశారు. దీంతో పాకిస్థాన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ గెలుపుతో పాకిస్థాన్ ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది. భారత్ ఇప్పటికే సూపర్ 4లో రెండు విజయాలు సాధించి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.