Asian Games 2026: ఆసియా క్రీడలు 2026: 30 బంతుల్లోనే మ్యాచ్ ఖతం.. జపాన్ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత మహిళల జట్టు..
భారత మహిళల జట్టు..
Asian Games 2026: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్‌లో భారత జట్టు అద్భుతమైన బోణీ కొట్టింది. నిస్సిన్‌లో ఆతిథ్య జపాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 30 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి దర్జాగా సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జరగనున్న రెండో సెమీఫైనల్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
బౌలర్ల విజృంభణ: 57 పరుగులకే జపాన్ ఆలౌట్
టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత స్పిన్నర్ల ధాటికి జపాన్ బ్యాటర్లు పరుగులు తీయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
శ్రీ చరణి స్పిన్ మాయాజాలం:
యువ ఎడమచేతి వాటం స్పిన్నర్ శ్రీ చరణి తన కెరీర్ అత్యుత్తమ ప్రదర్శనతో మెరిసింది. కేవలం 10 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి జపాన్ నడ్డి విరిచింది. ఏడో ఓవర్‌లో వరుస బంతుల్లో ఓపెనర్ హరునా ఇవాసాకి, కెప్టెన్ మాయి యానాగిడాలను ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది. పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేసిన షఫాలీ వర్మ 13 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జపాన్ జట్టు 19.5 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. జపాన్ ఇన్నింగ్స్ మొత్తం మీద కేవలం మూడు బౌండరీలు మాత్రమే నమోదు కావడం భారత బౌలర్ల ఆధిపత్యానికి నిదర్శనం.
షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్
కేవలం 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చింది. మొదటి ఓవర్ నుంచే దూకుడు ప్రదర్శించిన షఫాలీ కేవలం 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 40 పరుగులు బాదింది. మరోవైపు జి. కమలిని (0), భారతి ఫుల్‌మాలి (6) త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ, షఫాలీ జోరు తగ్గలేదు. వికెట్ కీపర్ రిచా ఘోష్ (6 బంతుల్లో 12 నాటౌట్)తో కలిసి షఫాలీ ఐదో ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించింది. దీంతో భారత్ 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగే సెమీఫైనల్ పోరులో బంగ్లాదేశ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.