NBA: అమెరికా బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్బీఏలో లాస్ ఏంజెలెస్ లేకర్స్ స్టార్ ఆటగాడు లుకా డాన్సిక్ సంచలనం సృష్టించాడు. తన అద్భుతమైన స్కోరింగ్ సామర్థ్యంతో దిగ్గజ ఆటగాడు మైఖేల్ జోర్డాన్ 38 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. ఈ ఘనత అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

నవంబర్ 4న సాక్రమెంటో కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లేకర్స్ 116-103 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో డాన్సిక్ ఒక్కడే 40 పాయింట్లు సాధించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించుకుంటూ బాస్కెట్ వైపు చేసిన దాడులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సీజన్‌లో తన జట్టు ఆడిన తొలి తొమ్మిది మ్యాచ్‌లలో ఎనిమిది మ్యాచ్‌ల్లో డాన్సిక్ పాల్గొన్నాడు. ఈ ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి 308 పాయింట్లు సాధించాడు. 1988-89 సీజన్‌లో మైఖేల్ జోర్డాన్ తొలి ఎనిమిది మ్యాచ్‌లలో 303 పాయింట్లు సాధించగా, డాన్సిక్ ఆ మార్కును అధిగమించాడు.

38 ఏళ్లుగా నిలిచిన ఈ గణాంకాన్ని అధిగమించడం డాన్సిక్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఆధునిక బాస్కెట్‌బాల్‌లో అత్యంత ప్రమాదకరమైన స్కోరర్లలో ఒకడిగా అతనికి ఉన్న గుర్తింపు ఈ ప్రదర్శనతో మరింత బలపడింది.

లాస్ ఏంజెలెస్ లేకర్స్ అభిమానులు డాన్సిక్ ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్థాయి ఆటతీరును సీజన్ మొత్తం కొనసాగిస్తే వ్యక్తిగత రికార్డులతో పాటు జట్టుకు కూడా మరిన్ని విజయాలు అందించగలడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags: