Australia Squad for T20 World Cup: ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ జట్టు ఇదే!
ప్రపంచ కప్ జట్టు ఇదే!
Australia Squad for T20 World Cup: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకల వేదికగా జరగనున్న T20 ప్రపంచ కప్ 2026 కోసం తమ 15 మంది సభ్యుల ప్రాథమిక జట్టును ప్రకటించింది. ఈ టోర్నీ కోసం స్పిన్నర్లకు ప్రాధాన్యతనిస్తూ ఆస్ట్రేలియా సెలెక్టర్లు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ వెన్ను గాయంతో బాధపడుతున్నప్పటికీ, అతడిని జట్టులోకి ఎంపిక చేశారు. ఈ నెల చివర్లో జరిగే స్కాన్ రిపోర్ట్స్ ఆధారంగా అతని లభ్యతపై స్పష్టత రానుంది. అలాగే హ్యామ్‌స్ట్రింగ్ గాయాల నుంచి కోలుకుంటున్న జోష్ హేజిల్‌వుడ్, టిమ్ డేవిడ్‌లకు కూడా జట్టులో చోటు దక్కింది. ఉపఖండంలోని పిచ్‌లను దృష్టిలో ఉంచుకుని ఆడం జంపా, మ్యాథ్యూ కునెమాన్ వంటి నలుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేయడం గమనార్హం. మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ T20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో, జట్టులో ఒక్క ఎడమచేతి వాటం పేసర్ కూడా లేకపోవడం చర్చనీయాంశమైంది. స్పెన్సర్ జాన్సన్ గాయం కారణంగా తప్పుకోగా, జేవియర్ బార్ట్లెట్ ఎంపికయ్యారు. అలాగే గత 12 అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడని కూపర్ కానోలీ జట్టులోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఆస్ట్రేలియా జట్టు గ్రూప్-బిలో ఒమన్, ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంకలతో తలపడనుంది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 11న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఐర్లాండ్‌తో ఆడుతుంది. ప్రపంచ కప్‌కు ముందు ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌తో మూడు T20ల సిరీస్ ఆడనుంది. ఈ జట్టులో జోష్ ఇంగ్లిస్ ఏకైక వికెట్ కీపర్‌గా ఉన్నాడు, రిజర్వ్ కీపర్‌ను ఎంపిక చేయలేదు.
ఆస్ట్రేలియా T20 ప్రపంచ కప్ 2026 జట్టు:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానోలీ, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కెమెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మ్యాథ్యూ కునెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మ్యాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడం జంపా.