Australian Vice-Captain Ashleigh Gardner: సహచర క్రీడాకారిణితో ఎఫైర్ ఆరోపణలు.. ఎట్టకేలకు మౌనం వీడిన ఆసీస్ వైస్ కెప్టెన్
ఎట్టకేలకు మౌనం వీడిన ఆసీస్ వైస్ కెప్టెన్
Australian Vice-Captain Ashleigh Gardner: ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ ఆష్లే గార్డనర్ వ్యక్తిగత జీవితం ఇటీవల తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తన భార్య మోనికా రైట్‌తో విడాకులు, ఆపై వచ్చిన సంచలన ఆరోపణలపై ఎట్టకేలకు గార్డనర్ మౌనం వీడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె తొలిసారిగా తన స్పందనను తెలియజేశారు.
ఆస్ట్రేలియా ఓపెనర్ జార్జియా వాల్‌తో ఎఫైర్ ఉందంటూ ఆష్లే గార్డనర్ మాజీ భార్య మోనికా రైట్ బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా క్రికెట్ ఆస్ట్రేలియా (CA) బోర్డు గార్డనర్‌పై చర్యలు తీసుకోవాలని, వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ వివాదంపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించిన ఆష్లే గార్డనర్.. తన భార్యతో విడాకులు, వ్యక్తిగత విషయాలు తన వ్యక్తిగతమని, అయితే వైస్ కెప్టెన్ హోదాలో బోర్డుకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు.
తన నాయకత్వ బాధ్యతలకు మద్దతుగా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు గార్డనర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మోనికాతో గడిపిన అందమైన క్షమాలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. తమ మధ్య విభేదాల వల్ల జరిగిన నష్టానికి, కలిగిన బాధకు ఆమె క్షమాపణలు కోరారు. భవిష్యత్తులో మోనికా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన గార్డనర్.. ఇకపై ఈ వివాదంపై తాను ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయనని, అందరూ తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.