Bajrang Punia: ఒలింపిక్ విజేత ఇంట్లో విషాదం

ఇంట్లో విషాదం

Update: 2025-09-12 07:19 GMT

Bajrang Punia: ఒలింపియన్ రెజ్లర్ బజరంగ్ పూనియా తండ్రి బల్వాన్ పూనియా అనారోగ్యంతో కన్నుమూశారు. బజరంగ్ పూనియా తండ్రి బల్వాన్ పూనియా ఊపిరితిత్తుల సంబంధిత దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ గురువారం (సెప్టెంబర్ 11, 2025) రాత్రి కన్నుమూశారు. మరణించే నాటికి ఆయన వయసు 50 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం హర్యానాలోని ఝజ్జర్ జిల్లా, ఖుడాన్ గ్రామంలో నిర్వహించబడ్డాయి. ఆయనకు భార్య, బజరంగ్‌తో సహా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. బజరంగ్ తన తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్నారు. బజరంగ్ పూనియా రెజ్లింగ్‌లో తన తండ్రి నుండి ప్రేరణ పొంది, అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. బజరంగ్ పూనియా తన తండ్రి మరణం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన తండ్రిని కోల్పోవడం తన జీవితంలో పెద్ద లోటు అని, ఆయన తనలోని స్ఫూర్తిని, కష్టపడే తత్వాన్ని పెంచారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.గత 18 రోజులుగా బల్వాన్ పూనియా ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. బజరంగ్ పూనియా తండ్రి బల్వాన్ పూనియా కూడా ఒకప్పుడు రెజ్లరే. చిన్నతనం నుంచే తన కుమారుడికి రెజ్లింగ్ మెలకువలు నేర్పించారు. తండ్రి నుంచి నేర్చుకున్న పాఠాలతోనే బజరంగ్ పూనియా ప్రపంచస్థాయిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో 65 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించి దేశం గర్వపడేలా చేశారు. ఒక రెజ్లర్‌గా మారాలన్న బజరంగ్ కల, అతని తండ్రి ప్రోత్సాహంతోనే సాకారమైంది.

Tags:    

Similar News