2027 Asia Cup: బంగ్లాదేశ్ వేదికగా 2027 ఆసియా కప్

ఆసియా కప్

Update: 2026-07-08 04:57 GMT

2027 Asia Cup: క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రతిష్టాత్మక ఆసియా కప్-2027 టోర్నమెంట్‌ను బంగ్లాదేశ్‌లో నిర్వహించడానికి సన్నహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. వచ్చే ఏడాది జూన్ 18 నుండి జూలై 4, 2027 వరకు ఈ మెగా టోర్నీ జరగనుందని సమాచారం. ఈ ప్రతిపాదిత టోర్నమెంట్ కోసం బంగ్లాదేశ్‌లోని మిర్పూర్, చటోగ్రామ్, మరియు సిల్హెట్ అనే మూడు ప్రధాన నగరాలను ఆతిథ్య వేదికలుగా గుర్తించారు.

ఈ విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సెక్యూరిటీ కమిటీ చైర్మన్ సయీద్ ఇబ్రహీం అహ్మద్ మంగళవారం మాట్లాడుతూ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఈ మూడు ప్రతిపాదిత వేదికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, వివరాలను తమను అడిగిందని తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ హోస్టింగ్ ప్లాన్స్‌ను అధికారికంగా ఖరారు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బొగూరాలోని షహీద్ చందు స్టేడియం కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి తమ ప్రాధాన్యత మాత్రం ఢాకా, సిల్హెట్, చటోగ్రామ్‌లపైనే ఉందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ చివరిసారిగా 2016లో టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌కు ఆతిథ్యమివ్వగా, దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్లీ తమ దేశంలో ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు.

అయితే, ఈసారి ఆసియా కప్ నిర్వహణ అంత తేలికగా సాగేలా కనిపించడం లేదు. గత 2026 టీ20 ప్రపంచకప్ వివాదాలు, ఆ తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతినడం వంటి పరిణామాలు ఈ టోర్నీపై రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా, యూఏఈ (UAE) వేదికగా జరిగిన గత ఆసియా కప్‌లో ఆటగాళ్ల మధ్య షేక్‌హ్యాండ్ తిరస్కరణలు, సున్నితమైన వ్యాఖ్యలు వంటి ఎన్నో రాజకీయ, వ్యక్తిగత వివాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ వేదికగా జరగబోయే ఈ ఎడిషన్‌లో కూడా అటువంటి ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు, భారత్-బంగ్లాదేశ్ ద్విపాక్షిక సంబంధాలపై ఉన్న అనిశ్చితి నీడలు క్రమంగా తొలగుతుండటంతో, ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించే అవకాశాలు మెరుగయ్యాయి. షెడ్యూల్ ప్రకారం జరగబోయే ఈ పరిమిత ఓవర్ల సిరీస్ (వైట్ బాల్ టూర్) కోసం టీమిండియాకు ఎలాంటి లోటు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడానికి బీసీబీ సిద్ధమవుతోంది. విదేశీ జట్లకు, ముఖ్యంగా భారత్ లాంటి పెద్ద జట్లకు భద్రత ఎప్పుడూ కీలకమైన అంశమేనని, ఇప్పటివరకు బీసీసీఐ (BCCI) తో తాము అధికారికంగా చర్చలు ప్రారంభించనప్పటికీ, పర్యటన సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటామని సయీద్ ఇబ్రహీం హామీ ఇచ్చారు.

Tags:    

Similar News