BCCI: రాహుల్ ద్రవిడ్ కు ప్రతిష్టాత్మకమైన అవార్డు
ప్రతిష్టాత్మకమైన అవార్డు
BCCI: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ప్రతిష్టాత్మకమైన బీసీసీఐ 'కర్నల్ సి.కె. నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్' అవార్డును అందుకున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీసీసీఐ 'నమన్' అవార్డుల ప్రధానోత్సవంలో ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకున్న ద్రవిడ్, తన సుదీర్ఘ ప్రయాణంలో తనకు తోడ్పాటునందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అత్యంత వినమ్రంగా ప్రసంగించారు. భారత క్రికెట్‌కు ద్రవిడ్ అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా బోర్డు ఈ పురస్కారాన్ని అందజేసింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ద్రవిడ్, తనతో పాటు అవార్డులు అందుకున్న మాజీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌లను అభినందించారు. ముఖ్యంగా మిథాలీ రాజ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆమె ఎంతో మంది యువతీ యువకులకు స్ఫూర్తిగా నిలిచారని, ముఖ్యంగా 2017 ప్రపంచకప్‌లో ఆమె ప్రదర్శన అద్భుతమని కొనియాడారు. అలాగే తన చిన్ననాటి రోజుల్లో రోజర్ బిన్నీ తనను కారులో డ్రాప్ చేసిన ఒక సరదా సంఘటనను గుర్తు చేసుకుంటూ, అప్పట్లో ఆయనను వరుస ప్రశ్నలతో విసిగించి ఉంటానని నవ్వుతూ చెప్పారు.
క్రికెట్ అనేది కేవలం మైదానంలో ఆడే ఆట మాత్రమే కాదని, దీని వెనుక ఎంతో మంది అజ్ఞాత వ్యక్తుల శ్రమ దాగి ఉందని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. మనం మొదట ఆడిన మైదానాలు, తొలి కోచ్‌లు, అంపైర్లు, మనల్ని గ్రౌండ్‌కు తీసుకెళ్లిన వ్యక్తులు.. ఇలా ప్రతి ఒక్కరూ భారత క్రికెట్ ఎదుగుదలలో భాగస్వాములేనని ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డు వారి త్యాగాలకు మరియు సహకారానికి దక్కిన గౌరవమని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. గడిచిన మూడు దశాబ్దాలలో బీసీసీఐ సాధించిన ప్రగతిని, చిన్న పట్టణాల నుండి ఆటగాళ్లకు లభిస్తున్న అవకాశాలను ఆయన ప్రశంసించారు.
వేదికపై ఉన్న యువ క్రికెటర్లను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించిన ద్రవిడ్, వారు ఆటలో తన నుండి కొన్ని విషయాలు నేర్చుకుని ఉండవచ్చని, కానీ వారి డ్రెస్సింగ్ స్టైల్‌ను చూస్తుంటే అది మాత్రం కచ్చితంగా తన దగ్గర నేర్చుకున్నది కాదని జోక్ చేయడంతో హాలంతా నవ్వులతో నిండిపోయింది. తన ఎదుగుదలలో తల్లిదండ్రులు అందించిన సమతుల్యత మరియు క్రమశిక్షణ ఎంతో కీలకమని ఆయన చెప్పుకొచ్చారు. క్రికెట్ ముఖ్యం అయినప్పటికీ, జీవితంలో అంతకంటే విలువైనవి మరికొన్ని ఉంటాయని వారు నేర్పినట్లు తెలిపారు.
చివరగా తన భార్య విజీత చేసిన త్యాగాలను ద్రవిడ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాధారణంగా వివాహం అంటే ఇద్దరి సమాన భాగస్వామ్యం అంటారని, కానీ తన విషయంలో తన భార్యనే ఎక్కువ బాధ్యతలను మోసిందని, ఆమె సహకారం వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని కృతజ్ఞతలు తెలిపారు. 1987లో విజయ్ మర్చంట్ ట్రోఫీతో మొదలైన తన ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుండటం పట్ల తాను ఎంతో అదృష్టవంతుడినని, ఈ గౌరవం దక్కడం తనకెంతో గర్వంగా ఉందని ద్రవిడ్ తన ప్రసంగాన్ని ముగించారు.