Big Blow to Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్ కు భారీ షాక్: హర్షిత్ రాణా, పతిరానా దూరం.. కానీ రీప్లేస్‌మెంట్స్ లేవు!
కానీ రీప్లేస్‌మెంట్స్ లేవు!
Big Blow to Kolkata Knight Riders: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతోంది. జట్టులోని ప్రధాన బౌలర్లు హర్షిత్ రాణా, మతీషా పతిరానా గాయాల కారణంగా ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. అయినప్పటికీ, వీరిద్దరికీ ప్రత్యామ్నాయ ఆటగాళ్లను తీసుకోవడం లేదని మేనేజ్మెంట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
శ్రీలంక వేగవంతమైన బౌలర్ మతీషా పతిరానాను వేలంలో 18 కోట్ల భారీ ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. అయితే 2026 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఆయనకు హ్యామ్‌స్ట్రింగ్ గాయం కావడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పతిరానా కోలుకుంటున్నారని, ఐపీఎల్ రెండు నెలల సీజన్ లో ఏదో ఒక దశలో ఆయన జట్టుతో కలుస్తారని కేకేఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు రీప్లేస్‌మెంట్‌ను తీసుకుంటే, నిబంధనల ప్రకారం పతిరానా ఈ ఏడాది ఆడే అవకాశం కోల్పోతారు. అందుకే ఆయన కోసం వేచి చూడాలని జట్టు భావిస్తోంది.
టీమిండియా యువ బౌలర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా ఇప్పటికే శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన కోలుకోవడానికి కనీసం కొన్ని వారాల సమయం పడుతుంది. నిజానికి ఆయన ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, జట్టులోని ఇతర భారతీయ బౌలర్లపై కేకేఆర్ నమ్మకం ఉంచింది. వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి, ఆకాశ్ దీప్ వంటి నాణ్యమైన బౌలర్లు అందుబాటులో ఉండటంతో కొత్త వారిని తీసుకోవాల్సిన అవసరం లేదని మేనేజ్మెంట్ భావిస్తోంది.
మరోవైపు, బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌కు ఐపీఎల్ ఆడేందుకు అనుమతి లభించకపోవడంతో, ఆయన స్థానంలో జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీని కేకేఆర్ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. 6 అడుగుల 8 అంగుళాల పొడవుండే ముజారబానీ తన బౌన్స్‌తో ప్రత్యర్థులను కంగారు పెట్టగలడని జట్టు నమ్ముతోంది.కేకేఆర్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. గాయాల బెడద ఉన్నప్పటికీ, ఉన్న వనరులతోనే టైటిల్ వేటను మొదలుపెట్టాలని కోల్‌కతా సిద్ధమవుతోంది.