Boxer Lovlina Complaint: నోరు ముయ్..చెప్పింది చెయ్..
చెప్పింది చెయ్..;
Boxer Lovlina Complaint: బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, తాత్కాలిక కమిటీ సభ్యుడు కల్నల్ అరుణ్ మాలిక్ తనను అవమానించాడని టొక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, బాక్సర్ లవ్లీనా ఫిర్యాదు చేసింది. తనను లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశాడని ఆరోపించింది.
జూలై 8న జరిగిన ఒక అధికారిక వీడియో కాన్ఫరెన్స్ లో (జూమ్ మీటింగ్) అరుణ్ మాలిక్ తనపై గట్టిగా అరిచారని, తనను అవమానించేలా మాట్లాడారని లవ్లీనా పేర్కొంది. నోరు మూసుకో, తల దించుకుని మేము చెప్పింది చెయ్ అని మాలిక్ అన్నారని ఆమె ఆరోపించింది. మాలిక్ మాటలు కేవలం అవమానకరంగానే కాకుండా లింగ వివక్షతో కూడిన అధికార ధోరణిని చూపించాయని లవ్లీనా తన ఫిర్యాదులో తెలిపింది. ఒక మహిళా అథ్లెట్‌గా తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారని ఆమె వాపోయింది.
పారిస్ ఒలింపిక్స్ కోసం తన వ్యక్తిగత కోచ్‌గా ప్రణామిక బోరోను నియమించాలని లవ్లీనా కోరింది. అయితే, ఫెడరేషన్ నిబంధనలకు ఇది విరుద్ధమని చెప్పి మాలిక్ ఆమె అభ్యర్థనను తిరస్కరించారని లవ్లీనా ఆరోపించింది.
ఈ ఆరోపణలను కల్నల్ అరుణ్ మాలిక్ ఖండించారు. జూమ్ మీటింగ్‌లో తాను ప్రొఫెషనల్‌గా మాత్రమే మాట్లాడానని, అథ్లెట్లందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. మీటింగ్ మొత్తం రికార్డ్ అయి ఉందని, దానిని సమీక్షించుకోవచ్చని కూడా తెలిపారు.లవ్లీనా ఫిర్యాదును స్వీకరించిన భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. దీనిపై నివేదిక సమర్పించడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.