T20 World Cup Squad: ఇవాళే టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన

టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన

Update: 2025-12-20 08:54 GMT

T20 World Cup Squad: 2026 టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ (BCCI) ఇవాళే అధికారికంగా ప్రకటించనుంది.ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మధ్యాహ్నం 1:30 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించి జట్టు వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లు గత కొన్ని మ్యాచ్‌లుగా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది.

ఇషాన్ కిషన్ ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా ఉండి, జట్టును విజేతగా నిలిపాడు. అతను 10 మ్యాచ్‌ల్లో 517 పరుగులు (సగటు 50 పైగా) చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫైనల్లో కూడా సెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం వికెట్ కీపర్ రేసులో సంజూ శామ్సన్, జితేశ్ శర్మ ముందు వరుసలో ఉన్నారు. శామ్సన్ ఇటీవలి సౌతాఫ్రికా సిరీస్‌లో ఆకట్టుకోవడం ఇషాన్‌కు కొంత ఇబ్బందికరంగా మారింది. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్ ఆందోళన కలిగిస్తుండటం, పైగా అతను గాయంతో ఉండటం వల్ల ఓపెనర్ స్థానంలో ఇషాన్‌ను బ్యాకప్‌గా తీసుకునే అవకాశం ఉంది.

వికెట్ కీపర్ రేసులో సంజూ శామ్సన్, జితేశ్ శర్మలతో పాటు రిషబ్ పంత్ లేదా ఇషాన్ కిషన్‌లలో ఎవరికి చోటు దక్కుతుందనేది చూడాలి. దక్షిణాఫ్రికాపై అదరగొట్టిన తిలక్ వర్మ, అభిషేక్ శర్మలకు జట్టులో చోటు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గత వరల్డ్ కప్‌లో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న రింకూకి ఈసారి మెయిన్ స్క్వాడ్‌లో చోటు దక్కుతుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. 2026 ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత్ - పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15 కొలంబోలో జరగనుంది.

Tags:    

Similar News