Aakriti Hits Back: పృథ్వీ షాతో బ్రేకప్ వదంతులు.. కాబోయే భార్య ఆకృతి ఘాటు కౌంటర్
కాబోయే భార్య ఆకృతి ఘాటు కౌంటర్
Aakriti Hits Back: భారత యంగ్ క్రికెటర్ పృథ్వీ షా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలోనే అతడికి ఆకృతి అగర్వాల్‌తో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. అయితే గత రెండ్రోజులుగా వీరిద్దరి బంధం తెగిపోయిందని, బ్రేకప్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు హల్చల్ చేశాయి. ఈ వదంతులపై తాజాగా ఆకృతి అగర్వాల్ స్పందిస్తూ నెటిజన్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అవన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేస్తూ.. ఇన్స్టాగ్రామ్ వేదికగా అసలు నిజం బయటపెట్టారు."
"అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే.. రెండు రోజుల క్రితం ఆకృతి తన ఇన్‌స్టా స్టోరీలో ఎవరి పేరు చెప్పకుండా, ‘నేను మోసపోయాను.. వదంతులన్నీ వాస్తవమే’ అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దాంతో నెటిజన్లు ఆ పోస్ట్‌ను పృథ్వీ షాకు ముడిపెడుతూ.. వీరి ఎంగేజ్‌మెంట్ రద్దయిందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆకృతి.. 'నేను ఎక్కడా నా కాబోయే భర్త పేరును ప్రస్తావించలేదు. మా బంధం రద్దయిందని కూడా చెప్పలేదు. అయినా కొందరు అంత త్వరగా దాన్ని పృథ్వీ షాకు లింక్ చేయడం చూసి ఆశ్చర్యపోయాను’ అంటూ మండిపడ్డారు."
"తాము ఎంతో సంతోషంగా ఉన్నామని.. కేవలం ఊహాగానాల ఆధారంగా ఒక వ్యక్తి ప్రతిష్ఠను ఎంత సులభంగా దెబ్బతీస్తారో ఈ సంఘటన ద్వారా తనకు అర్థమైందని ఆకృతి ఆవేదన వ్యక్తం చేశారు. తాను పెట్టిన ఆ స్టోరీ కేవలం తన క్లోజ్ ఫ్రెండ్స్‌ను ఉద్దేశించి పెట్టినదని.. ఒక చిన్న పొరపాటు వల్ల తాను ప్రేమించే వ్యక్తి పరువు కోల్పోయే పరిస్థితి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. కాగా, పృథ్వీ షా ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి ఎంపికైనప్పటికీ.. అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం దక్కలేదు. ఈ తరుణంలో ఈ బ్రేకప్ రూమర్స్ వైరల్ కావడం, దానికి ఆకృతి ముగింపు పలకడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది."