Aqib Nabi: లంక టూర్‌కు బుమ్రా దూరం.. టీమిండియాలోకి యువ సంచలనం ఆకిబ్ నబీ!
యువ సంచలనం ఆకిబ్ నబీ!
Aqib Nabi: భారత క్రికెట్ జట్టుకు భారీ షాక్! స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో.. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
అయితే, బుమ్రా స్థానంలో జమ్మూకశ్మీర్‌కు చెందిన యువ పేసర్ ఆకిబ్ నబీకి జాతీయ జట్టులో తొలిసారి పిలుపు రానుంది. గత రెండు రంజీ సీజన్లలో ఏకంగా 100కు పైగా వికెట్లు పడగొట్టి జమ్మూకశ్మీర్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆకిబ్ నబీ.. బ్యాటింగ్‌లోనూ ఉపయోగకరమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. దీంతో పర్వేజ్ రసూల్, ఉమ్రాన్ మాలిక్ తర్వాత టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికైన జమ్మూకశ్మీర్ మూడో క్రికెటర్‌గా ఈ యువ సంచలనం రికార్డు సృష్టించబోతున్నాడు.
బుమ్రా మోకాలిలో వాపు ఊహించిన దానికంటే తీవ్రంగా ఉండటంతో.. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం అతడిని తొందరగా బరిలోకి దించకూడదని నిర్ణయించింది. ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరిగే రెండో టెస్టు నాటికి ఫిట్ అయినా, భారీ పనిభారం ఉండే టెస్టు క్రికెట్‌లో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావిస్తోంది.
మరోవైపు, ఇప్పటికే నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ గాయాల కారణంగా కనీసం తొలి టెస్టుకు దూరం కాగా.. సాయి సుదర్శన్ మాత్రం గాయం నుంచి కోలుకుంటూ ప్రస్తుతం నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తున్నాడు. శ్రీలంక సిరీస్‌కు ఆయన అందుబాటులో ఉంటాడా లేదా అనేది త్వరలోనే తేలనుంది.