Centre Gives Green Signal : పాక్ తో ఆడేందుకు టీమిండియాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
టీమిండియాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్;
Centre Gives Green Signal : ఆసియా కప్‌లో టీమిండియా ఆడేందుకు కేంద్ర క్రీడాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త క్రీడా విధానం ప్రకారం పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోమని, కానీ ఆసియా కప్ వంటి బహుళ-జాతీయ ఈవెంట్లలో పాల్గొనేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌లు జరగడం ఖాయమైంది. ఈ కొత్త విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి
ఆసియా కప్ ,పాకిస్తాన్‌తో మ్యాచ్‌లకు సంబంధించి భారత క్రీడా మంత్రిత్వ శాఖ కీలక విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం భారత్ , పాకిస్తాన్ మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగవు. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లదు, అలాగే పాకిస్తాన్ జట్టు భారతదేశానికి వచ్చి ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడదు.
ఆసియా కప్ వంటి టోర్నమెంట్లు న్యూట్రల్ వేదికలపై జరుగుతాయి. అందుకే ఈసారి ఆసియా కప్ యూఏఈలో నిర్వహించబడుతోంది. బహుళ దేశాల టోర్నమెంట్ల కోసం భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. అదేవిధంగా, భారతదేశం ఆతిథ్యం ఇచ్చే ఈవెంట్లలో పాకిస్తాన్ పాల్గొనడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది.
ఈ కొత్త విధానం వల్ల ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న జరగనున్న మ్యాచ్‌తో పాటు, సూపర్ ఫోర్, ఫైనల్స్‌లో కూడా ఆడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం క్రీడా అభిమానులలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించింది.